వనవాసం రాముడికి శిక్ష అనుకుంటుంటే శుర్పనఖ ఇలా రాముడితో అన్నది .
" ఈ అలౌకిక ఆనంద సీమకు మీరు శిక్షకై వచ్చారా ! ఈ పరిశుద్ధ మధుర ఫలభరిత వృక్షాలు , పద్మాలతో నిండిన అతి శీతల సరోవరాలు , పర్వతాగ్రాల నుంచి దూకే సెలయేళ్ళు, మేఘాల మధ్య సూర్య చంద్ర కాంతుల్లో ఉత్సహంగా ఎగిరే పక్షి సమూహాలు , పొగ మంచుల్లో చంద్రోదయంగా తోచే సూర్యోదయాలు , ప్రాతః కాలాలలో పూలు రాలిన కాలి బాటలు , చల్ల గాలులు , కాంతులినే మంచు బాటల్లో పచ్చిక బయళ్ళు , ఈ ప్రకృతి చిత్రాలు మీరు చూడనివా ? ఈ పుష్ప భరిత నదీ తీరాల శోభనూ ఈ వినూత్న పక్షి కుజతాలనూ , ఈ క్రూరమృగ గర్జనా పులకింతలనూ , ఈ పరిమళ భరిత వెన్నెల రాత్రులనూ, ఈ సుందర ప్రకృతి శోభలో మీ జీవనంలో మీకేమి ఆనందం లేదా ? ఈ అరణ్య సౌందర్యాన్ని అనుభవించే వరం ప్రసాదించిన మీ పినతల్లి పట్ల మీకేమీ కృతజ్ఞత లేదా ? అని విస్మయంగా చూసింది .
రాముడు మాట రానట్టు అయిపోయాడు.

No comments:
Post a Comment