సృష్టిలో బంధాలన్నింటికీ అర్థం ఉంటుంది. వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనం ఎంతవరకు సామరస్యంతో, ప్రేమతో, బాధ్యతో వ్యవహరించగలమో అంతవరకూ అవి మనకు దూరం కావు. స్వార్థం కూడా బంధాల అమరికలో ముఖ్యపాత్ర పోషిస్తూ అమరికలకు ఆస్కారం ఇస్తూ ఉంటుంది. సంతోషం, ఇష్టం బంధాల రూపంలో దొరికినంత వరకూ మనలోని భావాలు పదిలంగా ఉంటాయి. కానీ కాస్త కష్టం కలిగిందో బంధాల మనోభావాలు తెబ్బతీస్తాయి. దూరంగా వెళ్లేందుకు సన్నద్ధం అవుతాయి. అయితే, అన్ని బంధాలు మన ప్రేమేయం లేకుండానే మన జీవితంలోకి వచ్చి చేరాయి. స్నేహబంధం మాత్రం మనం ఏరి,కోరి, నమ్మి, ఇష్టపడి చేరువయ్యే అద్భుతం, అదృష్టం.
అది ఒక్కసారి బలపడిందో జీవితాంతం తోడుండేది. షరతులూ, హద్దులు లేనిది, స్వార్థం అంటని స్వచ్ఛమైనది స్నేహం. అటువంటి స్వచ్ఛమైన స్నేహం కుచేలుని రూపంలో ప్రపంచానికి పరిచయం అయింది. కృష్ణున్నే మైమరిపించింది.
చిన్ననాటి స్నేహమే అయినా చిరకాలమై కుచేలునితత్వం కృష్ణుని మదిలో ఎదిగినదై స్థానం సంపాదించుకున్నది. కుచేలుని వ్యక్తివం విషయ విరక్తి అతన్ని నిశ్చయంగా ఉంచింది. కానీ బతుకు బాటలో ఆటుపోట్లు తప్పలేదు. చెదరని ఆత్మవిశ్వాసం, మేధస్సు, ప్రశాంత చిత్తం కుచేలుని బలాలు, బలహీనతలు.
కటిక దారిద్య్రం అనుభవించే పేదవాడే అయినా, కుచేలుడు అభిమానాన్ని చంపుకొని ఏనాడూ బతుకలేదు. ఎంతటి కష్టమొచ్చినా అతనిలోని సంతోషం చెక్కుచెదురలేదు. కృష్ణునితో కుచేలుని స్నేహం సాంతీపుడనే గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో కుదిరింది. చదువు ముగియడంతో మనుషులు దూరమైనా వారి మనుసుల్లో స్నేహం పదిలంగా నిలిచిపోయింది.
కృష్ణునికి కుచేలుడంటే ప్రత్యేకమైన అభిమానం, ఆదరణ. కుచేలునికీ కృష్ణుడంటే అవ్యాజమైన ప్రేమ. కృష్ణ లీలలు విన్నంతనే కుచేలుని మనసు ఉప్పొంగి పోయేది. ఎన్నడూ కృష్ణుడు తన స్నేహితుడనీ చెప్పుకొని గొప్పకు పోలేదు.
ఎందుకంటే కుచేలునిది నిస్వార్థమైన స్నేహం. అతని ఉద్దేశం ప్రకారం కృష్ణుని స్నేహం వలన తనలో ఆనందమనే ప్రేమ జనించింది. అది కుచేలునిలో ప్రశాంతతను నెలకొల్పింది. శాంతం నిశ్శబ్ధ నిబద్ధతను కుచేలునికి అనుభవైకవేద్యంలా అందించింది.
ఆ మౌనమే కుచేలునికి దైవత్వాన్ని ఆపాదించింది. అంటే బయట ప్రపంచం దృష్టిలో కృష్ణుడంటే రాజకుటుంబీకుడూ, దేవుడు. కుచేలుడంటే వేదవిదుడూ, పేదవాడు. కానీ కృష్ణునిలోని దైవత్వాన్ని తన వ్యక్తిత్వంలోనూ, కృష్ణునిపట్ల తనకున్న ప్రేమ, స్నేహంలోనూ పొందగలిగాడు కుచేలుడు.
అందుకే ఇంతకన్నా గొప్ప సంపద స్నేహబంధంతో కాక మరెలా సాధ్యమని కుచేలుని సదాలోచన. కుచేలుడు ఒకనాడు తన కుటుంబ పరిస్థితిని గురించి ఆలోచిస్తుండగా అతని భార్య వామాక్షి, కృష్ణుడు మీ చిన్ననాటి మిత్రుడ కదా! ఒక్కసారి వెళ్లి ఆయన్ను కలిస్తే మన బాధలన్నీ తీరిపోతాయని అనిపిస్తుందని అంటుంది. పిల్లల దీనస్థితి, భార్య మాట కుచేలున్ని కృష్ణుని కలుసుకునేందుకు ప్రేరేపించాయనే కన్నా, తన మిత్రుని కలుస్తాననే ఆనందానికి తోవయ్యాయి.
వట్టి చేతులతో వెళ్లడం సబబుకాదని ఇంట్లో మూలన దొరికిన కాసిన్ని అటుకులను తన ఉత్తరీయంలో మూటగట్టుకొని బయలుదేరుతాడు కుచేలుడు.కుచేలునికి తన కష్టాలకిక కాలం చెల్లిందనే సంతోషం ఏమాత్రం లేదు. ఎందుకంటే కృష్ణుని దర్శించడమే అతని మనసంతా నిండిన ముఖ్యోద్దేశం. దాని పొడుగునా అనేక సంశయాలు. ఎప్పటిదో చిన్ననాటి స్నేహం నాదీ, కృష్ణునిదీ.
అనంతమైన ద్వారకలో ఉండే కృష్ణున్ని కలవడానికి, కనీసం చూడటానికి నాకు అనుమతి దొరుకుతుందో, ఈ పేదవాని రూపం అందుకు తగినదేనా ! అయినా సరే, నాలోని ప్రేమ, నాస్నేహం కృష్ణునిపట్ల నిశ్చయమైనవే అయితే, తప్పక కలుస్తానని సంకల్పించుకొని వెళతాడు కుచేలుడు.కృష్ణుని కోసం రాజద్వారం దగ్గర వాకబు చేస్తూ, నేను కృష్ణున్ని కలువడానికై వచ్చానని కుచేలుడు అలా చెప్పాడో లేదో, స్వయంగా తన మందిరం వదిలి కృష్ణుడు హుటాహుటిన వచ్చి చేయిపట్టుకొని తన మందిరానికి తీసుకెళుతాడు. బంగారు ఆసనంపై కూర్చోబెట్టి, బంగారు పళ్లెంలో కుచేలుని పాదాల నుంచి సేవ చేస్తాడు కృష్ణుడు. మంచి విందు భోజనాన్ని కొసరి, కొసరి వడ్డిస్తూ, విజామరతో విసురుతూ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కుచేలునికి గుర్తు చేస్తాడు.
కుశలప్రశ్నలు ప్రేమగా అడుగుతాడు. తాను తెచ్చిన అటుకులు తనకెంతో ఇష్టమైనవని తృప్తిగా ఆరగిస్తాడు. ఇదంతా కుచేలునికి అంతుపట్టని విశేషం. నా స్నేహానికి ఇంతటి ఔదార్యమా!
ఇంతటి ప్రేమాభిమానాలా! అని ఆశ్చర్యపోతాడు కుచేలుడు. మరునాడు కృష్ణుని దగ్గర తృప్తిగా సెలవు తీసుకొని ఇంటిదారిపట్టిన కుచేలుని మనసులో తన్మయత్వం తప్ప మరేమీ లేదు. కుచేలునికి తన కష్టాలేవి గుర్తులేవు.
బాధల ఊసే లేదు. అలుపెరుగని ఆనందం తప్ప. ప్రపంచమంతా ఎవరిని సేవించాలనుకచుందో, అలాంటి కృష్ణుడు స్వయంగా నా కాళ్లు కడిగి శిరసున చల్లుకోవడమా! ఇంతకన్నా నాకు కావాల్సినదేంటని ఇంటికి చేరుకున్న కుచేలునికి తన పూరిగుడెసె స్థానంలో సకల సంపదలతో నిండిన అందమైన పాలరాతి మేడ కనిపించింది.
కృష్ణుని వాత్సల్యానికి మనసారా నమస్కరించి కృతజ్ఞత తెలుపుకున్నాడు కుచేలుడు. కానీ ఆ సంపద వలన అహంకారాన్నీ, వాటిపై వ్యామోహాన్ని పెంచుకోక యోగిలా జీవిత చరమాంకం వరకూ బతికాడు కుచేలుడు.కుచేలుని విషయంలో జరిగిన ఈ అద్భుతం కృష్ణుని మహత్తులా కనిపించినప్పటికీ, కుచేలునికే పాత్రత, అర్హత లేకపోయినట్లయితే జరిగే పనేనా! కులచేలునిలోని నిస్వార్థ ప్రేమ, స్నేహం కృష్ణుడంతటి వాడినే తన్మయింపజేసిందనేది నిర్వివాదాంశం. స్నేహం పరస్పర వ్యక్తీకరణ కన్నా, భావ పరిభాకే అర్థమవుతుందనేది కుచేలుని వ్యక్తిత్వం చెబుతున్నది.

No comments:
Post a Comment