Saturday, 25 November 2017

గొప్పవారి సందర్శనం

జీవితంలో దొరికే ఆనందం, ఆత్మతృప్తి వెనకాల మనం అనుకునే వస్తు విశేషమో, వ్యక్తి విశిష్టతో దాగి ఉందనే భ్రమ మనల్నీ, మన మనసుల్నీ దూరదూరంగానో, అర్థం కాని ద్వంద్వంలోనో కట్టి పడేస్తుంది. కానీ మనల్ని, మన మనస్సునూ, మేథస్సునూ నిజంగా ప్రభావితం చేసేది వ్యక్తిత్వ వైచిత్య్రమని అర్థం చేసుకోలేక.. అర్థమైనా, ఆకళింపు చేసుకునేంత సహృదయతకు అవకాశం ఇవ్వలేకపోతున్నాం. ఆలోచన చేయలేకపోతున్నాం. మంచి వారిని కలిసినా, మహాత్ములను సందర్శించినా మనలోని చైతన్యం ఆనందం రూపంలోనో, ఆత్మతృప్తిగానో ఉత్తేజమవుతుంది. అదృష్టం కలిసివస్తే ఆ అవకాశమే జీవితం అవుతుంది. జీవితాన్ని తెలుసుకోవడమంటే మనల్ని మనం తెలుసుకోవడమేనన్న అవగాహన ఏర్పడుతుంది.

మహాత్ముల చైతన్యం నీడగా మనలోని వ్యక్తిత్వం ప్రస్ఫుటమవుతుంది. దాన్ని అర్థవంతం చేసుకోవడమే మన కర్తవ్యమని చెబుతుందీ కథనం.



ఒకనాడు నారదుడు కృష్ణున్ని చేరి మహాత్ములను సందర్శిస్తే వచ్చే ఫలితం ఏంటనీ, వారిని కలుసుకున్నంత మాత్రాన ఒరిగేదేంటనీ ప్రశ్నిస్తాడు. నారదుని అమాయకత్వం, వెటకారం కలగలసిన ఆ ప్రశ్నకి మాటలతో సమాధానం సరిపోదనీ, కొన్నింటికి అనుభవ పూర్వకంగానే తెలియజెప్పాలనీ అనుకున్నాడు కృష్ణుడు నారదా!

నేను ఇంత క్లిష్టమైన సమస్యకి టక్కున జవాబు చెప్పలేను. నువ్వు తూర్పువైపుగా వెళ్లావంటే అక్కడో పెద్ద చెత్తకుప్ప ఉంటుంది. దాంట్లో ఒక పురుగు నివసిస్తుంది. దాన్ని అడిగి చూడు నీకు స్పష్టమైన జవాబు దొరుకుతుందంటాడు కృష్ణుడు.

నారదునికి పురుగు చెప్పడమేంటని కాస్త విడ్డూరంగా అనిపించినా, కృష్ణుని మాటపై నమ్మకంతో వెళ్లి పురుగును ప్రశ్నిస్తూ మహాత్ములను దర్శించడం వల్ల కలిగే ఫలితమేంటని అడుగుతాడు. నారదుడు అలా అడిగాడో లేదో ఆ పురుగు గిలగిలా కొట్టుకుని చచ్చిపోతుంది. దేవుడా! అనుకుంటూ కృషుణ్ణి చేరి విషయం చెబుతాడు నారదుడు.

కృష్ణుడేమో నారదునితో ఈసారి పడమర వైపునకు వెళ్లావంటే అక్కడ ఒక పాత దేవాలయం కనిపిస్తుంది. ఆ గుడిలో ఒక పావురం ఉంటుంది. దానిని అడిగావంటే నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుందంటాడు. సరేనని బయలుదేరి, ఆ గుడికి చేరుకొని పావురాన్ని ప్రశ్నిస్తాడు.

అంతే ఆ పావురం రెక్కలు ఆడిస్తూ నారదుని పాదాల దగ్గర వాలి ప్రాణం విడుస్తుంది. నిరాశగా కృష్ణుణ్ణి చేరిన నారదుడు జరిగిందంతా వివరిస్తూ నిట్టూరుస్తాడు. ఏమీ ఎరుగనట్టు కృష్ణుడేమో అయ్యో! అలా జరిగిందా?

అయితే ఈసారి ఉత్తరం వైపు వెళ్లు. అక్కడ ఉన్న రాజాస్థానంలో ఓ మగపిల్లాడు జన్మించాడు. ఆ బాలుడు నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలడంటాడు. రెండుసార్లూ ఊహించని పరిణామాలు ఎదురయ్యేసరికి మూడోసారి అడుగేసేందుకు కాస్త తటపటాయించాడు నారదుడు.

అది గమనించిన కృష్ణుడు నారదా! నాపై నమ్మకముంచి వెళ్లు. ఈ సారి అంతా మంచే జరుగుతుందని భరోసా ఇస్తాడు. అన్యమనస్కంగానే బయలుదేరినా కృష్ణునిపట్ల తనకున్న విశ్వాసం నారదున్ని ప్రశాంతపరిచింది.

ఉత్తర దిశలో రాజ సంస్థానంలోని ముఖ్య మందిరానికి చేరుకున్నాడు నారదుడు. ఉయ్యాలలో అందంగా కనిపించిన పిల్లాడిని చూస్తూ నాయనా! గొప్పవారిని సందర్శిస్తే లభించే ఫలితమేంటని ప్రశ్నిస్తాడు. కొన్ని క్షణాలలోనే నారదుడు చూస్తుండగానే ఆ పిల్లాడు మహాతేజస్సుతో వెలిగిపోయే దేవతగా మారిపోతాడు.

నారదునికి ఏమీ అర్థం కాలేదు. ఏంటీ అద్భుతమని ఆశ్చర్యంతో విస్తుపోతాడు. అప్పుడా దేవత నారద మహర్షీ! ఎందుకలా ఆశ్చర్యపోతారు.

నేనెవరినో కాదు. మొదట్లో చెత్తకుప్పలో మీరు కలిసిన పురుగును. మీ దర్శనం వల్ల పావురంలా జన్మెత్తాను. అప్పుడు కూడా మీ దర్శనం వల్లనే రాజకుమారుడిలా జన్మను పొందాను.

అప్పుడే అలా రాజకుమారుడిలా పుట్టానో లేదో, మళ్లీ మీ దర్శనభాగ్యం కలిగింది. ఇదుగో ఇలా దైవత్వం లభించిందని ఆకాశమార్గంలో వెళ్లిపోతాడు. జీవితాన్ని అర్థం చేసుకున్నా, ఆస్వాదించినా, జీవితాన్ని అవగాహనా పూర్వకంగా సఫలం చేసుకున్నా ఒనగూరేది మహత్వం, గొప్పతనం. అటువంటి వారిని అనుకొని కలిసినా, అనుకోకుండా సందర్శించినా మనం నిగ్గుతేలి మనలోని చైతన్యం ప్రభావితమవుతుంది.

తెలిసి పట్టకున్నా, తెలియక పట్టుకున్నా నిప్పు కాలుతుంది. నీటిలో పడిపోతే శరీరం తడిసిపోతుంది. అలాగే మంచి వ్యక్తిత్వం గల మహాత్ములను సందర్శించినంతనే ఆనందం, ఆత్మతృప్తి వాటంతటవే మనలో ప్రభావితం అవుతాయి. వాటిని అనుభవించడం వల్లనే జీవితతత్తం అలవడుతుంది.

మండుతున్న నిప్పులో పడేసిన వస్తువులు నిప్పుగానే మారినట్లు మహాత్ముల సందర్శనంలో సామాన్యమైన వ్యక్తిత్వం, జీవితం గొప్పదై పునీతమవుతుంది.

No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...