Saturday, 25 November 2017

శకుంతల


ప్రకృతిని ప్రేమించేవారు ప్రపంచాన్నీ ప్రేమించగలరు. ప్రపంచమంటే జీవజాతితో నిండిన మహా సంసారసాగరం అని మరచిపోకూడదు. కానీ ఈ ప్రేమ స్వార్థం ఎరుగదు. కల్మషం లేనిది. అపారమైన జ్ఞానగుంఫితంగా పరిమళించేది. అన్నింటికీ అతీతమైంది. ఆదరణకు ఆలవాలమైంది. అర్థానికి అసలైన నిర్వచనమైంది. అనర్థాన్ని కలలోనైనా కోరుకోనిది.. ఇలా మంచినీ, మానవత్వాన్నీ ధీటైన నిజరూపంగా శక్తికి ప్రతిరూపమైన స్త్రీ స్వరూపంగా జీవితం తాకిడికి తలొంచే పరిస్థితులకు బెదరని, చెదరని ఆదర్శ మహిళగా, ప్రకృతికి మాతృత్వంతో సేవ చేసినదై తల్లీ తండ్రీ తానుగా మారిన అమ్మగా భారతదేశానికి పేరునిచ్చిన భరతునికి జన్మనిచ్చిన మహాతల్లిగా చరిత్రలో స్థానం సుస్థిరం చేసుకుంది శకుంతల. కానీ ప్రశాంతంగా, ఆర్భాటాలకు అతీతంగా అనుమాన నమ్మకాల నడుమ పెనుగులాడే ప్రేమకై నిరీక్షించి, గెలుపును కాలానికి దానం చేసి తాను నిమిత్తమాత్రురాలిగా నిలిచిపోయింది. ఈమె సహనంలోని శోభ భారతావనికి దాతృత్వమై ఒప్పారింది.


శకుంతల మేనక, విశ్వామిత్రుల కూతురు. చిన్నతనంలోనే అడవిలో విడిచిపెట్టారు వారు.

చెట్టు చేమలూ పక్షులూ ఆమెను పెంచసాగాయి. అది చూసిన కణ్వముని హృదయం ద్రవించి ఆమెను కన్నకూతురిలా పెంచుకుంటాడు. శాకుంతలములే ఆమె ఆలనాపాలనా చూసాయి గనుక శకుంతలగా పేరు గాంచింది. ఆశ్రమ జీవితానికి అంకితమైపోయింది.

ప్రకృతితో మమేకమై పోయింది. ఆమె కనుసైగలతో పులకించిపోయేవి ఆమె పెంచుకున్న చెట్లూ, లతలూ, జంతువులు. అవే లోకంగా బతుకుతుంది శకుంతల. ఇంతలో వేటకై వచ్చిన దుష్యంతుడు కణ్వాశ్రమానికి రావడం, ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడం, దుర్వాసనుడు అతను నిన్ను మర్చిపోతాడన్న శాపం ఇవ్వడం, అనుకున్నట్టుగానే దుష్యంతుడు ఆమెను తిరస్కరించడం కాలం సాక్షిగా జరిగిపోయాయి.

కణ్వమహర్షి సన్యాసిగా ఉండి కూడా శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోతుంటే తట్టుకోలేక, నా పరిస్థితే ఇలాగుంటే సామాన్యుల గతేంటని విలపిస్తాడు. అది లోకం రీతో, కణ్వుని పితృస్థానం విశేషమో కాదు. శకుంతల గుణం, ఆమె నిండైన రూపం, ఆమెలోని మంచితనం అందుకు నిదర్శనం. చిన్నతనంలోనే కన్నవారు వదిలేసారు.

ఆమె వారిని నిందించలేదు. ప్రకృతి ఒడిలో ఆనందాన్ని వెతుక్కుంది. కణ్వుని నీడలో పెంచబడి దుష్యంతుడికి భార్యగా వెళ్ళిపోయింది. అక్కడా తిరస్కారమే ఎదురైంది.

అయినా శకుంతల కుంగిపోలేదు. తిరిగి తండ్రి కణ్వుని చేరి ఆయన్ను బాధించలేదు. ఒంటరిగా బతకసాగింది. భరతునికి జన్మనిచ్చింది.

తల్లిగా తన బాధ్యతను నిర్వర్తించింది. దుష్యంతుడు తన తప్పును తెలుసుకొని వచ్చి తననూ, తన కుమారున్నీ చేరదీస్తానన్నప్పుడు కాదనలేదు. వాదనకూ దిగలేదు. భార్యగా, రాణిగా, తల్లిగా తనవంతు పాత్రను పోషించింది.

కాళిదాసు మాటల్లో చెప్పాలంటే శకుంతల రూపం వాసన చూడని పువ్వు. గోరుసోకని చిగురు. ఉలితో చెక్కని రత్నం. ఆస్వాదించని మధువు.

శకుంతలంటేనే పూర్వజన్మ పుణ్యాల అఖండఫలం. అలాంటి శకుంతల జీవితం మాత్రం అనిశ్చితమై, అతలాకుతలమై అనాదరణకు ప్రతీకయై నిలిచిపోయింది. కానీ ఆమె ఎవ్వరినీ కారకులుగా పేరుపెట్టలేదు. తనది కాని పరిస్థితికి ఎవ్వరినీ నిందించలేదు.

నిర్భయంగా, నిశ్చలంగా బతికింది. ప్రకృతికి ప్రేమను పంచింది. ఆమెలోని సహనాన్ని ప్రపంచానికి అంకితమిచ్చింది.శకుంతల అంటే అన్ని గుణాలకూ చిరునామా. కానీ ఆమెలోని ప్రేమ అన్నింటికన్నా గొప్పది.

అందుకేనేమో ప్రేమ అనే బంధం మనిషిలో ఆశని సజీవంగా ఉంచుతుందనీ ఆశ అనే బంధం ఎంత గొప్ప దుఃఖాన్నైనా సహించేటట్లు చేస్తుందనీ తన జీవితమే నిదర్శనంగా చూపింది. ఆమెలోని మనోహరమైన మంచితనం ఆమెకు లోకజ్ఞతను కానుకగా ఇచ్చింది. కన్నవారు వదిలేశారనే బాధ ఆమెను తాకలేదంటే ఆమెలోని విజ్ఞత సుస్పష్టమవుతుంది. కణ్వుడు కన్నతండ్రిగా పెంచుకుంటానంటే ఆమె హృదయం పితృస్థానాన్ని ఆహ్వానించింది.

ఆమెలోని ప్రేమ దుష్యంతుని వరించింది కనుకనే తిరస్కారాన్నీ ఆమోదించేందుకు ఆమె గుండె నిబ్బరం తోడుగా నిలిచింది. ఒంటరిగా తల్లిదండ్రుల బాధ్యతను నెత్తిన వేసుకొని భరతుణ్ని పెంచిందంటే ఆమెలోని నిర్ణయాత్మకవైఖరి ప్రస్ఫుటమవుతుంది. కాలం అందించే జీవితపు ఆటుపోట్లు శకుంతలను కుంగదీయక పోగా మరింత నిగ్గుతేల్చాయి. ఒక స్త్రీ నిశ్చయంగా సంకల్పిస్తే జీవితాన్ని పరిపూర్ణత్వం దిశగా తీసుకెళ్లేందుకు ఎంతటి బాధనైనా సహనంతో స్వీకరిస్తూనే ఉంటుందని నిరూపించింది శకుంతల.

ఆదర్శాన్ని విజయాల సాధనలోనో, ఆనందాల వెదుకులాటలోనో అందిపుచ్చుకోవడం పరిపాటి. కానీ గొప్పవారి జీవితంలో ఎదురయ్యే కష్టాల వైఖరిలో ఆదర్శాన్ని గుర్తిస్తే మన కష్టాలు అత్యంత చిన్నవిగా కనిపించడమే కాదు, వాటిని దాటుకొచ్చే మార్గాలూ సులభమవుతాయి. కొందరి జీవితాలను అదృష్ట దురదృష్టాలతో బేరీజు వేస్తారు. మరికొందరు సుఖదుఃఖాలకు వదిలేస్తారు.

కానీ మన ప్రమేయం లేకుండానే జీవితంలో పరిస్థితులకు మనమెలా బాధ్యులమై పోతున్నామో వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో ఎంతగా నలిగిపోతున్నామో ఎవ్వరికీ అర్థం కాదు. అర్థం అయ్యేలా చెప్పేందుకు జీవితకాలం సరిపోదు. అందుకే శకుంతలలా జీవిత నిర్వచనాలు ఇచ్చుకునే పనిని ప్రపంచానికి వదిలేసి తనలోని తత్తానికీ, మానవత్వానికీ మరక అంటనీయక బతికితే చాలదా! జ్ఞానం, ప్రేమ, సత్యం అన్నీ తరించినట్లే.

No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...