Monday, 27 November 2017

కర్ణుని ధర్మ సిద్ధాంతం

మనదేశంలో పూర్వాచార పరాయణత అనే దానికి లోబడే జీవిత ధర్మం కొనసాగుతూ వస్తుంది. అదే సత్యమై ఒప్పారుతుంది. దానిని జీర్ణించుకొని బతుకు సాగించడమే మనిషికి ఆవశ్యకమైంది. అయితే అది మంచినే ప్రోత్సహిస్తూ, మన జీవితాన్ని గాడిలో పెడుతూ, సమాజానికీ వన్నెతెచ్చేలా ప్రవర్తిస్తూ ధర్మం నీడలో ఎదిగితే నష్టం లేదు. కానీ ఆ పరాయణత విశ్వాసానికి తలవొగ్గి సొంతలాభం లెక్కించక, ఎటువంటి నిందలైనా భరిస్తూ తాను నమ్మిందే ధర్మమనే స్థాయికి చేరితేనే మంచీ చెడుల మధ్య ఊగిసలాడే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచించే పద్ధతే మారిపోతుంది. ఇటువంటి పోలికే గొప్ప లక్షణాలన్నీ ఉన్న మహా కథానాయకుడు కర్ణుడు.


ధర్మమే విజయాన్ని వెతుక్కుంటూ వస్తుందని తెలియని వాడు కాదు కర్ణుడు. తన తల్లిపై, సోదరులపై ప్రేమను చూపించలేని కఠోరుడు కాదు కర్ణుడు.

లోకంలో తనకంటూ గౌరవాన్నిచ్చి, స్నేహం చూపించి, విశ్వాసాన్ని కలిగినందుకు ప్రతిఫలంగా దుర్యోధనునికిచ్చిన గౌరవం కర్ణుని జీవితం. అధర్మాన్ని విరోధిస్తూనే ధర్మపోరాటానికి తలొగ్గిన గొప్ప వ్యక్తి కర్ణుడు. లోపాలూ, శాపాలూ తనను నమ్మినవారి పాలిట అసంతృప్తిగా మిగిలిపోరాదని జీవితాన్నే ఫణంగా పెట్టిన ఘనుడు కర్ణుడు. భక్తి పరాయణత్వం స్వామి వ్యక్తిత్వాన్ని కాదని, తానిచ్చిన స్థానానికనీ తెలియపరుస్తూనే ధర్మ విజయం వ్యక్తిత్వపు ఖాతాలో వేసుకొని తన అమాయకత్వం, నిజాయితీతో జీవితంలో ఓడిపోయిన కర్ణుని మనస్తత్వం మరుగునపడినా ఆతని గుణగణంలో నిగ్గు తేలుతుంటుందనేది వాస్తవం.
 కర్ణుడు కుంతీదేవి ప్రథమ పుత్రుడు.

సూర్యభగవానుని అంశ.. అయినా కుంతీ కన్యత్వం కారణంగా సూతకులంలో రత్నమై వెలిగాడు. పాండవులకు అగ్రజుడే అయినా వారి విరోధిగా మిగిలిపోయాడు. అతిరథ, రాధల పెంపకంలో పెరిగి రాధేయుడైనాడు.

సహజ కవచకుండల భూషితాకర్ణుడు కనుక కర్ణుడైనాడు. రాజరికం పుట్టుకలోనే ఉంది గనుక క్షత్రియ లక్షణాలను పుణికిపుచ్చుకున్నవాడై ద్రోణాచార్యుని వద్ద శస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. అర్జునునికి ఏమాత్రం తీసిపోని వీరత్వం కర్ణునిదే అయినా తనని ప్రశంసించని లోకంపై ద్వేషం పెంచుకున్నాడు. అర్జునునితో ద్వంద్వయుద్ధం చేస్తూ సూతుడని అవమానపడి వెనుదిరిగే పరిస్థితిలో దుర్యోధనుడు కర్ణుడిని చేరదీసి, అతనికి అంగరాజ్యమిచ్చి రాజును చేసి క్షత్రియునిగా గుర్తింపు నిచ్చాడన్న కృతజ్ఞత, విశ్వసనీయత కర్ణున్ని కురువిధేయున్ని చేసింది.పరశురాముని దగ్గర బ్రాహ్మణుడని చెప్పి బ్రహ్మాస్త్రప్రయోగం నేర్చుకున్నాడు కర్ణుడు.

అర్జునుని కంటే పైస్థాయి తనది కావాలన్న స్వార్థమే దానికి కారణం అయింది. ద్రౌపదీ స్వయంవరంలోనూ తన ప్రయత్నం అర్జునుని కారణంగా విఫలమైందని తెలుసుకొని పాండవులను ఎలాగైనా రాజ్యభ్రష్టులను చేయాలని సంకల్పించాడు కర్ణుడు. దుర్యోధనుని కోరికా ఇదే అయినా, అతని ద్వేషంలో, కర్ణుని ద్వేషంలో చాలా తేడా ఉంది. అధర్మంలో పాండవులను ఓడించాలనే కుతంత్రం దుర్యోధనుడిది.

ధర్మంగా బహిరంగ యుద్ధంలో తన శక్తియుక్తులతో పాండవులని ఓడించాలనే ఆలోచన కర్ణునిది. విదుర భీష్మాదులను గౌరవించేవాడే అయినా పాండవపక్షంలో వారి ఔదార్యతకు విభేదించేవాడు కర్ణుడు. పాండవులకూ, కర్ణునికీ రక్త సంబంధం మాత్రమే మిగిలింది, కానీ ఏనాడూ సఖ్యత కుదురలేదు. ప్రత్యక్ష విరోధ విభేదాలు పాండవులకూ, కర్ణునికీ మధ్య ఏనాడూ లేవు.

కానీ దుర్యోధనునిపై గల స్వామిభక్తితో అతని ద్వేషాన్నే తన ద్వేషంగా మలుచుకున్న కర్ణుడు నిజంగా అమాయకుడే. దుర్యోధనుడు చేసే అధర్మపు ఆలోచనలను హర్షించని కర్ణుడు సహవాసం చేశాడే గాని సంగతిని ధర్మవిరుద్ధం చేయలేదు. పాండవులతో సంధి చేసుకోవడమే యుక్తమని చెప్పిన భీష్మునిపై కోపగించుకొని భీష్మునికి యుద్ధంలో సహాయపడననీ, తను యుద్ధరంగంలో ఉన్నంత వరకూ అస్త్రం పట్టనని శపథం చేసిన కర్ణుడు భీష్ముని తదనంతరం కౌరవసేనకు ఆధిపత్యం వహించాడు. కుంతీదేవీ, శ్రీకృష్ణుడు కర్ణుని జన్మ వృత్తాంతం తెలిసి ఇప్పటికైనా పాండవుల పక్షంలో ఉండమనీ, వారూ నీ సోదరులే గనుక కనికరం చూపమనీ నీవు ఒప్పుకుంటే నీకే పట్టం కట్టెదరనీ చెప్పినా చలించక నాకు అస్తిత్వాన్నిచ్చిన దుర్యోధనునితోనే తన జీవితకాలం సమర్పించి తీరుతానని కరాఖండిగా చెబుతాడు.

ఇంద్రుడు మాయగా వచ్చి కవచ కుండలాలను అడిగితే సంకోచించిక దానమిచ్చిన మహాదాత కర్ణుడు.సర్వసేనాధిపత్యం వహించిన కర్ణుడు ఒకనాడు శల్యుడు నేనే గనుక కర్ణుని రథానికి సారథ్యం వహిస్తే అర్జునుడు చావకుండా చూస్తానని పాండవులకిచ్చిన మాట తెలియక శల్యుడే రథసారధిగా కావాలని కోరుకుంటాడు. బ్రాహ్మణుడనని చెప్పి తన వద్ద విద్య నేర్చుకున్నందుకు గాను నీకు ఆపద సమయంలోనే మంత్రాలు మర్చిపోగలవనే శాపం, తెలియకుండానే ఒకసారి తను వేసిన బాణం దూడకు తగిలి చనిపోయినందుకు గాను యాగధేనువును చంపినందుకు యుద్ధ సమయంలో నీ రథచక్రాలు భూమిలో కూరుకుపోయి నీవు చంపాలనుకొనే వాడి చేతిలోనే మరణం తథ్యమని శాపం తెలిసినా శల్యుని దెప్పిపొడుపు మాటలు బాధించినా చివరివరకూ పోరాడిన స్వామిభక్తి పరాయణుడు కర్ణుడు.

No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...