Monday, 27 November 2017

శబరి

లోకంలో కొన్ని బంధాలు చాలా అరుదుగా లభించే అపురూపాలు. అవి ఏర్పడటం వెనుక ఎటువంటి 
స్వార్ధచింతనా ఉండదు. ఫలాపేక్షా ఉండదు. పరిచయమే ఉండదు. కానీ, అవి అవినాభావ బంధాలై లోకంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆనందానికి ప్రతిరూపాలై ఆత్మతృప్తిని మిగులుస్తాయి. బంధాలు ముఖ్యంగా మూడు విధాలు. నీతో నీవు ఏర్పరుచుకొనే బంధం నీతోనే అంతమవుతుంది. కుటుంబంతో, సమాజంతో, స్నేహితులతో ఏర్పరుచుకొనే బంధం నేను అనే దాన్ని మనంగా మారుస్తుంది. 
ఇక చివరిది భావనాజనిత సంబంధం. ప్రపంచానికి అతీతమైందై, తపస్సు కన్నా గొప్పదై, కనిపించని అద్భుత రూపమై, ఆర్భాటాల కందనిదై, ఆలోచనల కన్నా ఉన్నతమైందై, ఆత్మ సంబంధానికి మూల స్థానంగా పరిఢవిల్లే అపూర్వ బంధం. అటువంటి ఆత్మ సంబంధానికి ప్రతీకగా తన జీవితాన్ని మలుచుకున్న గొప్ప మహిళ శబరి. భిల్ల జాతి తన పుట్టుకను నిర్దేశించినా రుషి పదాన్ని తన నడవడికతో ఆపాదించుకున్న శబరి రామకథలో అందమైన బంధమై నిలిచింది. 


జీవితం అంటే ఎన్నో మలుపులూ, సమస్యలూ, సరదాలూ, ఆలోచనలు.. ఇలాంటివేవీ శబరి జీవితానికి వర్తించవు. ఆమెకు తెలిసిందల్లా రామదర్శనం కోసం జీవిత చరమాకం దాకా వేచి చూడడం, అవసరమైతే రామదర్శనం కానిదే మరణాన్ని కూడా కాదనుకునేంత గుండె నిబ్బరం. మాతంగ మహర్షి ఆశ్రమంలోనే తన జీవితాన్ని గడిపింది శబరి. భయంకరమైన దండకారణ్యంలో ఋషుల సేవలు, మహర్షులు నడిచే మార్గాలను శుభ్రం చేయడం, రామ నామస్మరణ చేస్తుండడం శబరి దినచర్య. ఆమెకు వేరే ఆలోచన లేదు. అవసరమూ లేదు, ఆనందం తప్ప. 
ఒక మనిషి నిశ్చలంగా ఎటువంటి సుఖాలనూ ఆశించక, దేని గురించీ కనీసం తలంపునకైనా రానీయక, తనకు లోకంతో పనేలేక, కేవలం తన ఆత్మ సంబంధానికై జీవితమంతా ఎదురు చూడడమంటే ఎంతటి సాహసం. అటువంటి సాహసానికి నిలువెత్తు నిదర్శనం శబరి. 

మాతంగ ముని ఆశ్రమంలో తరాలు మారుతున్నాయి. వేదఘోష ఎందరో శిష్యులను పునీతులను చేసింది. ఎన్ని తరాల వేదనాదాన్ని మరలా మరలా విని తరించిందో శబరి. చివరికి మాతంగ ముని కూడా శబరీ.. రాముడు తప్పక వస్తాడు, వేచి చూడు.. దర్శించు, తరించు అని చెప్పి లోకానికి వీడ్కోలు చెప్పి వెళ్లిపోతాడు. శబరి మాత్రం అదే ఆశ్రమంలో బతుకుతూ, ప్రతిరోజూ నేడు నా రాముడు వస్తాడంటూ మార్గాన్ని పూలతో అలంకరించడం, ఆశ్రమాన్ని శుభ్రపరచడం, రాముని కోసం తియ్యని ఫలాలను సేకరించడం చేస్తూండేది. రోజు గడిచేది, చీకటి పడేది. అయినా శబరిలో నిరుత్సాహం ఉండేది కాదు. రేపటి రోజు కోసం మరింత ఆత్రుతతో ఎదురుచూసేది. 
పంపా తీరంలో రోజుల తరబడి రాముని రాక కోసం ఎదురుచూసిన శబరి స్థిరత్వం చాలా గొప్పది. విసుగనేదే ఎరుగని ఆమె ఆత్మసంతృప్తి అపారం. మనుషుల్లోని బంధాలు నిలబడాలంటే, అవి చేరువవ్వాలంటే మనలోని అహంకారాన్ని బద్దలు కొట్టాలి. అభిమానం అడ్డు రాకూడదు. కానీ శబరీ రాములది ఆత్మ సంబంధం. దానికి ఎటువంటి అడ్డంకీ లేదు. అందుకే ఆ ఘడియ రానే వచ్చింది. పంపా తీరానికి చేరుకున్నాడు శ్రీరాముడు. అల్లంత దూరాన శబరి ఆశ్రమం కనిపించింది. అంతే, రాముని మదిలో శబరి రూపం బంధమై చిగురించింది. శబరీ రామున్ని చూసింది. కనుచూపు మేర కనిపించేది రాముడేనని తెలుసుకున్న శబరి పులకించిపోయింది. సిద్ధురాలైన బోయవనిత శబరి నా రాముడు నాకై వస్తున్నాడు అంటూ ఎదురెళ్లి ఆహ్వానించింది.

రామునికీ తెలుసు, కేవలం దర్శనభాగ్యం కోసం అంకితమైన జీవితం శబరిది. ఆమె తపస్సే శబరికి సర్వస్వం. అది సిద్ధింపచేసేందుకే నా రాక తప్ప.. నాదేమీ లేదని శబరితో అన్న రామున్ని చూస్తూ.. రామా! నీ దర్శనంతోనే కదా నా తపన, తపస్సు సిద్ధించేది. ఇవ్వాళ నా జన్మ తరించింది. నేటితో నేను పవిత్రురాలినయ్యాను అంటుంది. మాతంగ వనమంతా తిప్పి చూపించింది రామలక్ష్మణులకి. తాను సేకరించిన మధుర ఫలాలను కొరికికొరికి రుచి చూసి మరీ రామునికి అందించింది. రామచంద్రుడు ఆ పండ్లను తింటూ ఉంటే ఆనందంతో పొంగిపోయింది శబరి. ఇక తనకు సెలవు ఇప్పించమనీ, కేవలం నీ దర్శనం కోసమే తరించిన నా జీవితం పరిపూర్ణమైందనీ రాముణ్ని వేడుకుంటుంది. మనసారా రామున్ని దర్శించి, నమస్కరించి అగ్నిప్రవేశం చేస్తుంది. ఆ అగ్నిగర్భం నుంచే దివ్య తేజస్సుగా జనించి అనంతలోకాల్లో కలిసిపోయింది శబరి. 
శ్రీరామ దర్శనం కోసం జీవితకాలమంతా పరితపించిన శబరి జీవితం ధన్యమైనట్లే, శబరిని కలుసుకున్న రాముని మనసూ కుదుటపడిందట. అదేనేమో ఆత్మసంబంధం అంటే! స్ఫటికంలా స్వచ్ఛమైన జీవితం శబరిది. ఆమెలోని భావసంపద లోకంలోని మనం అనుకొనే గొప్ప వస్తు ప్రపంచం కన్నా గొప్పది.

No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...