Monday, 27 November 2017

భరతుడు

ప్రపంచంలో కొన్ని వ్యక్తిత్వాలు ఎంతటి గొప్ప స్థానానికి చేరుకుంటాయంటే, చాలాసార్లు అపార్థాలకు తావిస్తూ మనలోని అమాయకత్వాన్ని ఎత్తి చూపుతాయి. అర్థం అవుతూనే అబ్బురపరుస్తాయి. వారి గొప్పతనం ప్రేమ, గౌరవం, విశ్వాసాల విలువలను కచ్చితంగా నిర్దేశించేదై ఉంటుంది. సున్నితత్వానికి ఆనవాలుగా మారుతుంది. త్యాగనిరతితో చరితార్థమవుతుంది. అనూచాన ధర్మంగా మారి తరతరాల వారసత్వ నిధిని పదిలపరుస్తుంది. రాజనీతి, ధర్మనీతి, సామాజిక న్యాయం, పరాక్రమ పౌరుషం, కుటుంబమంటే గౌరవం, నమ్మిన సిద్ధాంతాన్ని అమలు పరిచే సాహసం, మనుషులనే కాక వారివారి మనస్తత్వాలకు విలువనిచ్చే విధానం, తత్వమెరిగే విశాల హృదయం.. లాంటివెన్నో కలగలిస్తే నిండైన నిజరూపం ఆవిష్కార మవుతుంది. ఆ రూపం అపురూప వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.

సద్గుణాలన్నీ రాశులుగా పోసి నిండైన వ్యక్తి స్వరూపంగా పరికిస్తే అది భరతుడై దర్శనమిస్తుంది. తనను తాను ఎన్నడూ నేను ఇదని పరిచయం చేసుకోవడమే తెలియని వాడు భరతుడు. రాముని నీడలో, అడుగుజాడల్లో అనూచానుడై నడిచాడు భరతుడు.



కైకేయీ దశరథుల పుత్రుడు.

రాముని సోదరుడు. అయోధ్య క్షేమాన్నే సదా కోరుకున్న బాధ్యతాదక్షుడు భరతుడు. రాముని వెంట లక్ష్మణుడు సదా తోడుంటే పరోక్షంలోనే రామసన్నిధి తాదాత్మ్యాన్ని ఆత్మసాక్షిగా అనుభవించిన వాడు భరతుడు. అందుకే అంటారు రాముని గౌరవం అంటే రామలక్ష్మణ భరత శుత్రుఘ్నులనీ.

దానిని నిలబెట్టే ప్రయత్నంలో నూటికి నూరుపాళ్ళూ సఫలమైనాడు భరతుడు.శాంత స్వభావం, కలలోనైనా చెడు తలంపును చేయనటువంటి మంచితనం, సున్నితత్వం, తనవారంటే వల్లమాలిన ప్రేమ భరతుని నిజనైజంగా భావించబడ్డాయి. అన్న అయిన రామున్ని అనునయిస్తూనే జీవితం గడపాలనుకున్నాడే గానీ రాజ్యకాంక్షతో కాదు. కానీ అదే నిందను మోయాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా కుంగిపోయాడు. తనకే పాపం తెలియదని మనస్సు అలిసిపోయేంత వరకూ మొరపెట్టుకున్నాడు.

తాను చేయని తప్పుకు దోషిగా తలదించుకోవాల్సి వచ్చినందుకు అల్లాడిపోయాడు. ఎదుటి వారి సుఖాన్ని ఎంతయినా వర్ణించవచ్చు గాని, కష్టాన్ని వ్యక్తీకరించడం అసాధ్యం.కైకేయి దశరథున్ని వరాలు కోరడం, సీతారామ లక్ష్మణులు అడవులకు వెళ్ళడం, దశరథుడు చనిపోవడంతో తాతగారి ఇంటికి వెళ్ళిన భరతశత్రుఘ్నులను హుటాహుటిన పిలిపించాడు వశిష్ఠుడు. తమను పిలిపించిన కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ భరతుని మనస్సు కలవరపడుతుంది. అయోధ్యకు వచ్చి తనతల్లి కైకేయి ద్వారా నిజం తెలుసుకున్న భరతుడు కైకేయి పాపపు తలంపును పలు విధాలా నిందిస్తాడు.

ఇక నీవు నాకు తల్లివే కాదు. కౌసల్యా సుమిత్రలు ఇద్దరే నాకు తల్లులు. ధర్మరక్షణకే జీవితాలను అంకితం చేసే ఇక్షాకుల సంప్రదాయమైన పెద్దవాడే సింహాసనం ఎక్కాలనేది కాలరాయాలనుకున్న దుష్టత్వం నీదైతే నేనే రాజ్యాన్ని కోరుకొని నీతో ఇలా చేయించాననుకునే ప్రపంచం నన్ను దోషిగా చూడటం నేను తట్టుకోలేను. ఈ క్షణమే కౌసల్యా సుమిత్రమైన తల్లులకూ, అయోధ్యకూ నేను దోషిని కాదనీ రాముని సేవకై పరితపించే సామాన్యుడననీ చెప్పుకోవాలి.

అడవులకు వెళ్ళి రామున్ని రాజ్యమేలుకోమనీ, నేను అరణ్యవాసం చేస్తాననీ చెప్పి ఒప్పిస్తానంటూ నిర్ణయం తీసుకున్న భరతుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటూనే తన తల్లి వల్లనే తనకీ దుస్థితి ఏర్పడిందని కుమిలిపోతాడు.రాజ్యం ఎన్నటికీ నాది కాదనీ రామునిదేననీ చెప్పి దశరథునికి అంత్యక్రియలు చేసి సకల అయోధ్యాపురంతో కదిలి రాముని దగ్గరకు పయనమవుతాడు. మనదైన స్వీయబాధ మన ఆలోచనా శక్తిని అణచివేయకూడదని చాలా చాకచక్యంతో వేలమందిని తోడ్కొని భరతుడు వెళ్ళిన తీరు అద్భుతం. ఎవ్వరికీ ఏ కష్టం రాకుండా అంతమందిని పద్ధతిగా చూసుకున్న విధానంతో భరతుడు ఎప్పుడో రాజైనాడు. రామునికి నేనెలా కీడు తలపెట్టగలనని విలపిస్తాడు.

రామచంద్రుని ముచ్చట్లు గుహుడు చెప్పినప్పుడు మనసారా ఆస్వాదించి తృప్తిపొందాడు. అయాచితంగా లభించిన రాజ్యాన్ని వదులుకోగల హృదయం భరతునికే సొంతం. భరతుని వంటి సోదరుడు ప్రపంచంలోనే ఉండడు. భరతునితో వచ్చిన అశేష జనవాహినికి విందును ఏర్పాటు చేసి భరతుని కారణంగా భరద్వాజ విందు విశ్వవిఖ్యాతమైంది.

రాముని పాదాలు పట్టుకొని నేను దాసుడను మాత్రమేననీ, జరిగినదంతా చెప్పి నీవే రాజ్యాన్ని ఏలుకోవాలనీ ప్రార్థిస్తూ నేను నిర్దోషినని ప్రకటించుకునే తీరు హృదయవిదారకం. పరిపరి విధాల రామునికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన భరతుడు రాముని మాట జవదాటలేక రామపాదుకలకు రాముని సముఖంలోనే పట్టాభిషేకం చేసి వాటిని సింహాసనం మీదుంచి పద్నాలుగేళ్ళు రాజ్యపాలన చేసాడు.భరతుడూ నారవస్ర్తాలు ధరించాడు. రాజ్యంలో అడుగుపెట్టకనే రాజ్యాన్ని బాధ్యతగా నడిపించాడు. కందమూలాలు తిన్నాడు.

కటికనేలపై పడుకున్నాడు. అరణ్య వాసకాలం తర్వాత రాముడు అయోధ్యకు రాకపోతే ప్రాయోపవేశం చేస్తానన్న ప్రతినకు కట్టుబడి ఉన్నాడు. రాజ్యకాంక్షే కాదు ఎటువంటి విషయాలపై ఆసక్తిని పెంచుకోక సానపట్టిన సంసారయోగిలా బతికినవాడై రాముడు అయోధ్యకు తిరిగివచ్చిన క్షణమే అయోధ్యను అప్పగించి అన్న సేవకే జీవితం అంకితం చేసాడు. ఎంతమంది ఉంటారు ఇలాంటి వారు.

స్వార్థం ముసుగులో అన్నదమ్ముల కుమ్ములాటలు, దాయాదుల పోట్లాటలు, కుటుంబంలోనే కక్షలు చరిత్రపుటల్లో కనిపించే మన కళ్ళకు భరతుని వంటి త్యాగం, నిస్వార్థమైన ప్రేమ, నిబద్ధత కనిపించలేదనే చెప్పాలి మరి.

No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...