Monday, 27 November 2017

కొరియన్ల ధైర్యం నచ్చింది

మేం 20 మందిమి కలిసి సౌత్‌ కొరియా వెళ్లాలని టికెట్స్‌ బుక్‌ చేసుకున్నాం. కాని ఆ దేశ అధక్ష్యులు మూన్‌ జియాన్‌, అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ గారి వాగ్వివాదం వల్ల యుద్ధం సంభవిస్తుందేమో అనే భయానికి 12 మంది స్నేహితులు ఈ ప్రయాణం మానుకున్నారు. మిగిలిన ఎనిమిది మంది సౌత్‌ కొరియాకి ప్రయాణం సాగించాం. సౌత్‌ కొరియాలో అడుగుపెట్టగానే మేం టాక్సీ తీసుకొని జియాంగ్‌బాక్‌గంగ్‌ ప్యాలస్‌ కు బయలుదేరాం. అక్కడే ''నేషనల్‌ ప్లేస్‌ మ్యూజియం ఆఫ్‌ కొరియా'' వుంది. లోపలికి వెళ్ళేదారిపొడవునా ఓ పండుగ వాతావరణం నెలకొనివుంది. ఎక్కడ చూసినా వేల జనం. రంగు రంగుల దుస్తులలో సీతాకోక చిలుకల్లాగ అలంకరించుకొని, ఒకరి కొకరు మాటలతో, తుళ్లింతలతో, ఆప్యాయతతో కౌగలించుకొంటూ వారి ప్రేమను ఫొటోస్‌లో బంధించుకుంటున్నారు. 

అమ్మాయిలు చిన్నరవికెను పెద్ద లంగాను ధరించి, దానిపై చిన్న కోటును, చక్కటి జడవేసుకొని పాపిటి బిళ్ళకు బదులుగా ఒక పువ్వును నడినెత్తిన అలంక రించుకొని, చెవులకి లోలాకులను అలంకరించి ఒకరిని మించి ఒకరు అందంగ ఒయ్యారాలు ఒలుకుతూ రాజభవనం చుట్టూ మహారాణుల్లాగ విహరిస్తు న్నారు. వారితో కలిసి ఫొటో దిగాం. సెప్టెంబర్‌ 26 నుండి అక్టోబర్‌ 2 వరకు నామ్‌ సడాంగ్‌ బండ్యెగీ ఫెస్టివల్‌, అక్టోబర్‌ నెలలో ఇక్కడ పండుగ వాతావరణం ఉంటుంది. కేవలం ఈ నెలలోనే మార్క్‌ డస్‌ ఫెస్టివల్‌, బుసన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, జరసం ఇంటర్నేషనల్‌ గాజ్‌ ఫెస్టివల్‌ జరుగుతాయి. ఆ పండుగ వాతావరణంలో మేం కొరియాలోని సియోల్‌లో అడుగుపెట్టాం. 
అద్భుతమైన ప్రాకారాలు... 
మొదట నేషనల్‌ మ్యూజియం చూశాం. జోషెన్‌ అనే రాజు 600 సంవత్సరాల కిందట సియోల్‌ని ముఖ్య పట్టణంగా తీర్చిదిద్దారు. ఆయన పాలనలో మౌంట్‌ బ్యాగసన్‌, మౌంట్‌ మాక్‌మియో షా, తర్కసన్‌ పర్వతశ్రేణి, ఇన్‌వాంగ్‌ షా అనే పర్వతశ్రేణి మధ్యలో ఈ పట్టణాన్ని నిర్మించారు. జియాంగ్‌బాక్‌ గంగ్‌ రాజుగారి స్థలంలో నాలుగు రాజభవనాల్ని కట్టారు. 600 సంవత్సరాల కిందట ఇతని కట్టడాలను అంచనా వేస్తే ఈ రాజుగారు ఎంతో తెలివైన వాడు. ఆ రోజుల్లోనే భవన ప్రాకారాలని బ్లూ ప్రింట్‌ని తయారు చేసి కట్టించారు. జియాంగ్జీ (1776 - 1800) కాలంలో లైబ్రరీలను, మేధావులు రచించిన గ్రంధాలను నిక్షిప్తం చేశారు. ఆ కాలంలో స్టేట్‌ సివిల్‌ పరీక్షలను కూడ నిర్వహించారు. జియాంగ్జీ రాజభవనాన్ని మూడు గంటలు తిలకించి వారి కళా నైపుణ్యాన్ని పొగుడుకుంటూ బయటికు వచ్చాం. అక్కడ ఆక్టోపస్‌కూర, ప్రాన్స్‌ పకోడాలు, కార్న్‌ వంటివి చాలా అమ్ముతున్నారు. 
లవ్‌ ఆఫ్‌ లక్‌ 
ఇక అక్కడి నుండి నామ్‌సన్‌ టవర్‌ సియోల్‌ కు బయలు దేరాం. ఈ టవర్‌ చాలా ఎత్తయిన కొండమీద ఉంటుంది. టవర్‌ మీదకు వెళ్లాలంటే 11కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆయాసపడుతూ పైకి ఎక్కాం. టవర్‌ను చూడగానే కింది నుండి నడిచిన అలసట అంత మాయమైంది. టవర్‌ దగ్గర ఫొటో దిగాం. ఆ తర్వాత 650 పెట్టి టిక్కెట్స్‌ తీసుకొని లిఫ్ట్‌ లో పైకి వెళ్ళాం. మౌంట్‌ నామ్‌సన్‌ ఎత్తు 262 మీటర్లు. ఇది సముద్రమట్టానికి 480 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ నామ్‌సన్‌ టవర్‌ 'లక్‌ ఆఫ్‌ లవ్‌' అనే స్థలం ఉంటుంది. ఆ ప్రదేశంలో రంగు రంగుల పువ్వులు క్రిస్‌మస్‌ చెట్లకు అలంకరించబడి ఉంటాయి. ఇవన్నీ ఒక ఇనుప చట్రంలో బిగించి ఉంటాయి. అందరూ తాళాలు కొని ఆ ఇనుప ఛట్రానికి కడతారు. ఇలా చేస్తే వారి ప్రేమ ఎప్పటికీ నిలిచిపో తుందని నమ్మకం. ఇక్కడ భూమి తక్కువగా కనిపిస్తుంది. అందుకనేమో వేలకొలది ఎన్నో అంతస్తుల సముదాయాల్ని చూస్తూ ఆనందించాం. అక్టోబర్‌ 4న సువాన్‌ హెచ్‌ వాసేయాంగ్‌ కోట దగ్గరకువెళ్లాం. ఈ కోటను జియాంగ్‌జో 22వ రాజైన జోన్‌యాన్‌ (1392-1910) కాలంలో నిర్మించారు. పై నుండి చూస్తే చైనా, జపాన్‌ కనిపిస్తుంది. ఈ పట్టణం సుమా రు 50 ఎకరాల ప్రాంగణంలో ఉంది. పట్టణం నిండా ఆనాటి ఇండ్లు, వారి వర్తకం, వ్యాపారాలు, అన్నీ కండ్లకు కట్టినట్టుగా మ్యూజియంలాగా ఉంచారు. 
కొరియన్‌ ఫోక్‌ విలేజ్‌... 
అక్కడి నుండి కొరియన్‌ ఫోక్‌ విలేజ్‌కి వెళ్ళాం. ఇది సియోల్‌ నుండి 36.6 కి.మీ దూరంలో వుంది. ఈ గ్రామంలో ఆనాటి శిల్ప కళలు, జీవనశైలి, వృత్తి, వ్యాపారాలు వారు ధరించిన దుస్తులు వాడిన పరికరాలతో వారి జీవన వైవిధ్యాన్ని చూపించే విధంగా ఈ ఫోక్‌ విలేజ్‌ వుంది. ఇసుక వేస్తే రాలనంత జనం, టికెట్‌ తీసుకొని లోపలికి వెళ్ళాం. అక్కడ అప్పట్లో వాడిన విసురు రాళ్ళు, బాటలు, రోకలి, పప్పుదినుసులతో ఒక గుడిసె, గుడిసెలో మట్టితో చేసిన కుండలు ఆ కుమ్మరి ఎలా కుండలు చేయాలో కూడ నేర్పిస్తున్నారు. అది చూస్తూ ముందుకు వెళ్తే అన్ని రంగులతో కూడిన తెరలు చెట్టుమీద నుండి కిందికి వేలాడుతూ కనిపించాయి. ఆ తెరలు పండగ వాతావరణానికి చిహ్నాలు. అలాగే ఆ గుడిసెల మీద పంపాస్‌ అనే గడ్డితో పై కప్పు వేశారు. ఇలా వేయడం వల్ల నీరు లోపలికి రాకుండా వుంటుంది. ఈ గడ్డి పది సంవత్సరాలు గుడిసెను కాపాడుతుంది. గుడిసె చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ పెంకులతో ఆకులు అల్లినట్టుగా మట్టితో కట్టి ఆ నీరు గోడమీద పడకుండ పెంకులతో చిన్న ఆర్చిలాగ కట్టారు. చాలా అందంగా వున్నాయి ప్రహరీ గోడలు. ఇక అక్కడి నుండి విన్యాసాల ప్రదర్శనకు వెళ్ళాం. తాటిమీద నృత్యం, గుర్రాలతో ఫీట్స్‌, చండ్ర కోలలతో కొట్టుకుంటూ, పొడవుగా రింగులు రింగులుగా తిప్పుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. చివరిగా ఒక వీధి నాటకం చూసి ఆనందించాం. 500 ఏండ్ల కిందట వాడిన కుండలు, ఎడ్లబండ్లు అంతా చాలా అందంగా వున్నాయి. అక్కడి నుండి ఇచియాన్‌ బీచ్‌కు బయలుదేరాం. కొరియన్‌ వాల్‌లో ఇచియాన్‌ 3వ పెద్ద పట్టణం. కొరియాలో మూడు మిలియన్ల జనాభావున్నారు. బస్‌లో బీచ్‌కు వెళ్ళే దారిలో మిలమిల మెరుస్తున్న బంగారు వర్ణపు సూర్యకిరణాలు నీటిమీద ప్రతిబింబిస్తూ అలలు. 
నీటిలో కేరింతలు కొడుతున్న చిన్న చేపల దృశ్యం మనసును ఆకట్టుకున్నాయి. అక్కడ బీచ్‌ అర్ధచంద్రాకారంలో ఎంతో అందంగా ఉంది. 
కొరియన్‌ భాషలోనే... 
మరుసటిరోజు గోల్డెన్‌సిటీ జియాంగ్‌జంగ్‌ అనే ప్లేస్‌కి ఉదయం 10 గంటలకు బయలు దేరాం. స్టేషన్‌లో ఒక కొరియన్‌ అమ్మాయిని కలిశాం. ఆ అమ్మాయితో రెండు గంటలు మాట్లాడాను. తాను కొరియన్‌ ప్రయాణికులను నార్వేకి తీసుకెళ్ళి అక్కడ ప్రదేశాలను చూపిస్తుంది. ఆ అమ్మాయి ఒక నార్వే అతనిని పెండ్లి చేసుకుంది. నేను కొరియన్‌ యుద్ధం గురించి అడిగితే చాలా ఉద్వేగంగా మాట్లాడింది. అందరూ ఏదో ఒక రోజు చనిపోతారు. రోజూ చస్తూ బతకం, రోజూ ఆనందిస్తూ ఏదో ఒక రోజు చనిపోతాం కాని యుద్ధం వస్తుందని మేం భయపడం. ఆమె చెప్పిన తీరు నాకెంతో నచ్చింది. ఆ అమ్మాయి ఎన్నో ప్రదేశాల పేర్లు, ఏవి చూడాలో వివరంగా తెలిపింది. కొరియన్స్‌ చాలా ధైైర్యవంతులు, తెలివైన వాళ్ళు. ప్రతి ఒక్కరూ కొరియన్‌ భాష మాట్లాడుతున్నారు. అన్నీ బోర్డ్సు కొరియన్‌ భాషలోనే వున్నాయి. జియాంగ్‌సాంగ్‌ వెళ్ళే దారంతా ఎంతో అందంగా వుంది. పసుపు రంగుల్లో అన్నీ వరిమళ్ళు, పచ్చటి పచ్చిక మైదానాలతో ఎతైన కొండలతో అందంగా వుంది. ఆ సాయంత్రం దగ్గరలో ఉన్న పగోడాను చూశాం. అక్కడ బౌద్ధమతం మీద ట్రైనింగ్‌ సెంటర్‌ వుంది. అక్కడి నుండి వరల్డ్‌ కల్చరల్‌ ఎక్స్‌పో సెంటర్‌కు వెళ్ళాం. అక్కడ ఎంతో ఎత్తయిన భవనం చూశాం. ఇక్కడ అన్నీ ఫుడ్‌ ఫెస్టివల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ వున్నాయి. అక్కడి నుండి సముద్రం దగ్గరకు వెళ్ళాం. ఇది హాన్‌ నది 494 కి.మీ దూరంలో వుంది. 
సరస్సులోనే రాజభవనాలు 
మరుసటిరోజు పొద్దున్నే బ్రేక్‌ఫాస్టు ముగించుకొని బస్‌టూర్‌ తీసుకొన్నాం. అక్కడి నుంచి రెండవ సెంచరీలో నిర్మించిన పెద్ద తాబేలును చూసి, కింగ్‌ సమాధి చూడడానికి వెళ్ళాం. అది ఎలా వుందంటే చిన్న కొండ ఆకారంలో వుంది. ఆ కొండంతా పచ్చని గడ్డితో కప్పబడి వుంది. అక్కడికి వెళ్లాగానే జోరు వర్షం, ఆ వర్షంలో తడుస్తూ సమాధి చూసి వచ్చాం. ఆ తర్వాత డాంగ్‌జంగ్‌ పాలస్‌, వోల్జీ పాండ్‌కు వెళ్ళాం. ఇది చిన్న సరస్సు. ఇందులో రాజుగారు కట్టిన మూడు బిల్డింగ్స్‌ వున్నాయి. 

ఈ సరస్సులో తేలుతూ ఉన్న రాజ కట్టడం ఎంతో అందంగా వుంది. చిన్న చిన్న పడవల హొయలు, ఎగిరి పడే ఎర్రటి చేప పిల్లలూ, వాటిని వేటాడేందుకు పోటీ పడే వలసపక్షులు, కంచెలా పచ్చటి చెట్లు. రాజు కట్టడాలు నీటిలో ప్రతిబిం బిస్తూ స్వర్గం అంటే ఇదేనేమో అనేంత ఆహ్లాదకరంగా ఆ వాతావరణం.
న్యూ సెవెన్‌ వండర్స్‌ ఆఫ్‌ నేచర్‌ 
ఆ తర్వాత బుద్ధుని ఆలయానికి వెళ్ళాం. ఈ ప్రదేశాన్ని కాపాడటానికి వాంగ్‌ సియాంగ్‌ అనే రాజు మూడు డ్రాగన్స్‌ని వుంచారు. ఈ డ్రాగన్స్‌ను మూడు చిన్న చేప పిల్లలుగా మార్చి చైనాకి తీసుకెళ్ళారు. ఈ డ్రాగన్స్‌ భార్యలు డాంగీపాండ్‌, చెంగిపాండ్‌లో వున్నాయి. ఈ డ్రాగన్స్‌ రాజుగారి దగ్గరికి వెళ్ళి మా భర్తల్ని ఈ చైనా వాళ్ళు తీసుకెళ్తున్నారని తెలిపాయట. వెంటనే ఆ రాజు ఆ చేప పిల్లల్ని తీసుకొనివచ్చి డ్రాగన్‌గా మార్చి మళ్ళీ ఒక బావిలో వేశారట. ఆ బావి దీర్ఘ చతురస్రాకారంలో వుంది. లోపల అంతా గుండ్రంగా వుంది. ఆ బావి నుండి వీటిని బైటికి తీయడానికి వీలులేకుండా కట్టారు. బుద్ధునికి నమస్కరించి ఆ బావిని చూసి వచ్చాం. ఇక్కడ మాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రతి చిన్న దానికి వంగి, నమస్కరించి గౌరవం ఇస్తున్నారు. అక్కడి నుండి ఒక షాప్‌కు వెళ్ళాం. అది కొరియన్‌ రెడ్‌ జిన్‌ సెంగ్‌. ఇది ఒక చెట్టు పేరు. దీంతో ఆల్కాహల్‌ తయారు చేసి ఒక బాటిల్‌లో భద్రపరుస్తారు. అక్కడ కొన్ని వస్తువులు కొనుక్కుని బుద్ధుని మానస్ట్రీకి వెళ్ళాం. బుద్ధుడు ఒక వేలుని ఇంకొక చేతితో పట్టుకున్న భంగిమలో వుంది. ఇలాంటి విగ్రహం ప్రపంచంలోనే లేదు. వేలాది జనం తమ మొక్కులను తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఒక రాయిమీద మరోరాయిని పేర్చి ఏ కోరిక కోరినా ఆ మొక్కు తీరుతుందని వారి నమ్మకం. అక్కడి నుండి సిల్లా ఆర్ట్‌ సైన్స్‌ మ్యూజియం వెళ్ళాం. ఆ తర్వాత జేజు ఐస్‌లాండ్‌కు వెళ్లాం అక్కడ నాలుగు రోజులు గడిపాం. ''సెవెన్‌ వండర్స్‌ ఆఫ్‌ నేచర్‌'' ఈ ప్రదేశంలోనే కనిపిస్తుంది. 

No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...