అసలైన పరిపూర్ణత్వం.
వినయం, ఆదరణ, ప్రేమ, స్నేహం, జ్ఞానం, చక్కని రూపం లాంటివెన్నో ఉన్నా అణువంతైనా గర్వం లేదు ప్రహ్లాదునిలో. ప్రహ్లాదుడు పరిహాసానికైనా అబద్ధమాడని సత్యవ్రతుడు. శ్రీహరి పట్ల అతను పొందిన అనుభూతి ముందు ప్రపంచమంతా చాలా చిన్నదిగా కనిపించేదతనికి. రాక్షసుని ఇంట పుట్టిన ప్రహ్లాదునికి మంచి గుణాలెలా వచ్చాయో, జీవన తత్వం ఎలా బోధపడిందో ఎవరికీ అర్థం కాలేదు.
ఒకప్పుడు దానవులకు రారాజైన హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడు. ఆ అవకాశం చూసుకొని ఇంద్రుడు అతని రాజ్యంపై దండెత్తి, రాక్షసులను హతమార్చి హిరణ్యకశిపుని భార్యను బంధించి తీసుకెళ్తున్నాడు. దారిలో నారదుడు ఇంద్రున్ని వారించి ఈమె కడుపులో పెరుగుతున్నది హరిభక్తుడు. హిరణ్యకశిపుని చావుకు కారణమైనవాడు, అతన్ని ఏ ఆయుధాలూ చంపలేవు.
కనుక ఆమెను విడిచి పెట్టమంటాడు. నారదుడు హిరణ్యకశిపుని భార్య లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఓదార్చి ప్రతి రోజూ ఎన్నెన్నో నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలను ప్రస్తావించేవాడు. అలా అమ్మ కడుపులో నుంచే నారదుని వల్ల సమస్తం తెలుసుకున్నాడు కనుకనే ప్రహ్లాదుడు పుట్టుకతోనే ఉన్నతమైన ఆలోచనాతత్వంలో విరాజిల్లాడు. రాక్షస లక్షణాలేవీ ప్రహ్లాదునిలో కనపడక పోయేసరికి కంగారుపడిన హిరణ్యకశిపుడు శుక్రాచార్యుని దగ్గర చదువు నేర్చుకోమని పంపిస్తే నేర్చిన శాస్త్రాలన్నీ బతుకడానికనీ చదువుల్లోని మర్మం తెలుసుకుంటే వాటితో పనిలేదని అంటాడు ప్రహ్లాదుడు.
హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు మాట్లాడే ప్రతిమాటా మేకులా గుచ్చుకుంటుంది. దానవ వైఖరిని స్మరిస్తూ వీడే దానవవంశాన్ని నాశనం చేస్తాడని అనుకొని కఠినమైన శిక్షలు విధిస్తాడు.కన్నతండ్రే తనను అర్థం చేసుకోక కఠినమైన శిక్షలు వేయమని పురమాయిస్తే ఏ మాత్రం భయం, బాధ లేవు ప్రహ్లాదునిలో, అంతులేని ఆనందం తప్ప. శ్రీహరే అంతా చూసుకుంటాడన్న విశ్వాసం అది. తాను నమ్మినదే తనకు రక్షగా భావించి ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు ప్రహ్లాదుడు.
ఏనుగుతో తొక్కించినా, భయంకరమైన నాగుపాములతో కరిపించినా, ఎగిసిపడే మంటల్లోకి తోసేసినా, భీకర సముద్రంలో ముంచేసినా, విషం పెట్టినా, ఎత్తయిన కొండలపై నుంచి దొర్లించినా, మండు టెండలో నిలబెట్టినా, కుండపోత వానలో వదిలేసినా, మంచుగడ్డలపై పడుకోబెట్టినా, ఎడతెగని గాలికి ఎదురు నడిపించినా, గోతిలో పాతిపెట్టినా, అన్నం, నీళ్ళు లేకుండా చేసినా, గదలతో, కొరడాలతో కొట్టించినా ప్రహ్లాదుని చిరునవ్వు చెరుగలేదు. అతని మనస్సు శరీరం మాత్రం బాధింపబడలేదు. చివరికి ప్రహ్లాదుని మనఃసంకల్పమే నృసింహావతారంగా వచ్చి హిరణ్యకశిపుని సంహరించింది. ప్రహ్లాదునిలో ఎంతటి ధైర్యం, నిశ్చయం ఉంటే తప్ప ఇన్నింటినీ తట్టుకొని నిలబడగలుగుతాడు.
తన పుట్టుక అర్థం తెలుసుకున్నవాడు గనుకనే ఎటువంటి పరిస్థితులెదురైనా తన నిశ్చయాన్ని వదులలేదు. ప్రహ్లాదుడు చెప్పిన జీవన సత్యాలు, విరక్తినీ, విముక్తినీ మాత్రమే వెల్లడిస్తాయంటే పొరపాటే. వాస్తవాలనూ, విలువలనూ, విషయ పరిజ్ఞానాన్నీ తెలియపరచి జీవితం సార్థకమయ్యేందుకు దోహదం చేస్తాయి. జీవన దృక్పథం తెలుసుకుంటే జీవితాన్ని కాక, బంధంగా ప్రేమించగలమని తెలియజెప్పిన ప్రహ్లాదుని నిశ్చితి, ఉన్నతి అత్యున్నతం.ప్రహ్లాదుడు చెప్పిన విషయాలు మనిషిలోని వివేకాన్ని తట్టిలేపుతాయి.
లేదు, కాదు అనుకునే వ్యతిరేక భావనే మన వైఫల్యానికి కారణమనీ, రక్షణేకానరాని వారికి రక్షణగా, దిక్కులేనివారికి దిక్సూచిలా, బలహీనులకు బలంగా, బలవంతులకు తేజస్సుగా సదా మనలోనే ఉన్న అంతర్యామినిని తెలుసుకుంటే లోకంలో దుఃఖానికి తావు లేదని చెప్పిన మాటలు జీవన సత్యాలుగా మిగిలిపోయాయి. మనిషిలోని అరిషడ్వర్గాలే మనకు శత్రువులనీ, వాటిని జయిస్తే ప్రపంచమంతా జయించినట్లేననీ, వివేకంతో కర్మబంధాల నుంచి తప్పుకోవాలే గానీ వివాదాలతో కాదనీ, అంతటా అన్నింటా ఉన్న తత్వాన్ని తెలుసుకుంటే ప్రపంచమంతా తెలుసుకున్నట్లే ప్రపంచమే నీవనే సత్యం తెలుసుకున్నట్లనీ వెల్లడించిన ప్రహ్లాదుని తత్వవివేచన ఎంతో గొప్పది, ఉన్నతమైంది.అంధకారం, అజ్ఞానం, అహంకారాలను మనిషిలోంచి తరిమికొడితేనే అసలైన జీవన దృక్పథం ప్రహ్లాదుడి వల్ల మనకు తెలిసివస్తుంది. మన సంకల్పం, నిశ్చయం, తత్వం సత్యభూషితమైతే కష్టాలు, దుఃఖాలు మనిషిని ఏమీ చేయలేవనేది ప్రహ్లాదుని ద్వారా తేట తెల్లమైంది.

No comments:
Post a Comment