Monday, 27 November 2017

ఊర్మిళ


జీవితానికి రెండు పార్శాలుంటాయి. ఒకటి అంతర్గతం, మరొకటి బహిర్గతం. రెంటికీ మధ్య తేడా ఏముంటుంది జీవితం అంటే జీవితమే కదా! అని తీసిపారేసేంత చిన్నదీ కాదు. అల్పమైందీ కాదు జీవితం. ఎంతో లోతైనది. గంభీరమైనదీ, అతీతమైనదీ, అపూర్వమైనదీ జీవితం. ప్రపంచానికి కనిపించే జీవిత కోణం గురించి నాలుగు విధాలుగా మాత్రమే కాదు, నాలుగు వందల విధాలుగా మాట్లాడుకునే అధికారం, నిర్వచించేంత అమాయకత్వం సమాజానికి ఉందనే చెప్పాలి. అంతర్గతమై ఆవిష్కృతం కాని అపురూపమై అగాథమై స్వీయ అధికారానికే లొంగే జీవిత కోణం అర్థం చేసుకోవడమంటే ఎప్పటికీ అసాధ్యమే. కొన్ని జీవితాలు పైకి సామాన్యంగా కనిపించినా లోలోతున పరికించే ప్రయత్నం చేస్తే అబ్బురపరిచేవై దురవుతాయి. గొప్పగా కనిపించే జీవితాల లోతులు అర్థం కాని మజిలీలై తారసపడతాయి. అందుకే ఎవరి జీవిత నిర్వచనం వారికే సొంతమై వారితో మమేకమవుతుంటే మహనీయమై పరిచయంగా పలుకరిస్తుంది.


అలాంటి జీవితాలలో ప్రత్యేకమై నిశ్శబ్ధంలో రాగమై పరిచయం తప్ప లోతెరుగనిదై కనిపిస్తూనే జీవితకోణాన్ని కొంగ్రొత్తగా చూపిస్తుంది ఊర్మిళ జీవితం.సీతకు చెల్లెలుగా, లక్ష్మణుని భార్యగా మాత్రమే ప్రపంచానికి పరిచయమైన ఊర్మిళ జీవిత నిర్వచనాన్ని తనదైన శైలిలో తెలియజెప్పిందంటే ఆశ్చర్యం, ఆనందం కలగలిసి మనలో ఆమెను గురించి ఇంకా తెలుసుకోవాలనే ఉత్సుకత మొదలవుతుంది.


రాచరికం, ఠీవి, చురుకుదనం పొందికైన అందం, అధికారాలపై పట్టు మిథిలానగరపు ధర్మశాసనాలు క్షుణ్ణంగా తెలిసిన సీత చాటు చెల్లెలు ఊర్మిళ. ఈమెకు అధికారం అంటే చిన్నతనం నుంచే మక్కువ. రాజధర్మాలన్నీ ఔపోసన పట్టిన యువరాణి.

అయోధ్యలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ అక్కడి లౌకిక వ్యవహారాలన్నీ అర్థం చేసుకొని, విధులన్నీ చక్కబెట్టే బాధ్యతను తనకు తానుగా కౌసల్య నుండి స్వీకరించింది. గంభీరమైన ధీరవనిత ఊర్మిళ. ఇదంతా ఊర్మిళ జీవితంలో కొంతభాగం మాత్రమే. పైగా ప్రపంచానికి తెలియని విభిన్న కోణం ఇది.

ఊర్మిళ అంటే కేవలం రామాయణంలో నిద్రకు ప్రతిరూపంగా పద్నాలుగేళ్ళు సీతారామలక్ష్మణులు అరణ్య వాసంలోకి వెళితే ఊర్మిళ పద్నాలుగేళ్ళు నిద్ర పోయిందనే మనకు తెలుసు. ఏదో పురాణ కథనం ప్రకారం లక్ష్మణుడు త్యాగం చేసిన నిద్రను తాను మోసిందనే విషయచర్చ. ఊర్మిళ జీవితాన్ని అంతకే పరిమితం చేసింది. కానీ ఊర్మిళ పద్నాలుగేళ్ళు అజ్ఞాతవాసంలో ఉంది.

ఆమె నిద్ర యోగ నిద్ర. మనిషనే రూపాన్ని చూడక ఎవరితో మాట్లాడక, తనవాళ్ళను గురించిన ఆలోచనే చేయక అన్ని సంవత్సరాలు ఒంటరిగా జీవించగలిగిందంటే ఎంతటి సాహసం. ఎంతటి కఠిన నిర్ణయం. కైకేయి దశరథుణి రెండు వరాలు కోరడం, అందులో భాగంగా రాముడు అడవికి వెళ్లడం, రాముని వెంటే తానని సీత అడవులకు పయనమై ఉంటే కథ మరోలా ఉండేదేమో.

కాని లక్ష్మణుడు రాముని సేవకే నేను పుట్టానని అన్నతోనే జీవితమని నిశ్చయించుకొని ఊర్మిళకు మాటైనా చెప్పక అడవులకు వెళతాడు. అయోధ్యంతా సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం గురించే దుఃఖిస్తుంది. కానీ ఊర్మిళ పరిస్థితే ఎవ్వరికీ తట్టలేదు. ఊర్మిళ మాత్రం వీటన్నింటికన్నా అతీతంగా ఆలోచించింది.

అధికారంతో అనుబంధాలతో నాకు పనే లేదన్నట్లు పద్నాలుగేళ్ళు అజ్ఞాతవాసం చేసింది. నిద్రలోనే నిత్య సంఘర్షణ చేసింది. నిజానిజాలు తెలుసుకుంది. శాంతికి చేరుకునే రహస్యాన్ని ఛేదించింది.

తన తపస్సుకు ఫలితంగా జీవిత ధర్మాన్ని తెలుసుకోగలిగింది. జీవితం మార్పును తీసుకొస్తే ఆ మార్పు తాకిడికి ఎటువంటి దశకు చేరుకుంటుందో చెప్పడం ఎవరితరం కాదు. అటువంటి మార్పే ఊర్మిళ జీవితంలో చోటు చేసుకుంది. ఊర్మిళ జీవితంలోని ప్రతీ మలుపునూ ఆమె ఆహ్వానించింది.

అంతకు మించి దానిని అర్థం చేసుకొని అందులో ఇమిడిపోతూనే అంతరార్థాన్ని తెలుసుకుంది. పద్నాలుగేళ్ల తర్వాత వచ్చిన సీతారాములను కోపంతోనో, ద్వేషంతోనో కాక అంతే అభిమానంతో గౌరవంతో చూసుకుంది. లక్ష్మణుడు తనను లెక్కచేయక, ఒక్కమాట అయినా చెప్పలేదనే అపవాదు రానీయక తన ధర్మాన్ని నిర్వర్తించింది. ఆమె సహనానికీ, ఆలోచనా పరిపక్వతకూ నిదర్శనం ఆమెలోని నిశ్చయత్వం.

చివరిదాకా తనదైన జీవినశైలిలో, తన వ్యక్తిత్వానికి వన్నె తరగకుండా ఎదురయ్యే సవాళ్ళనూ, మార్పులనూ ఎదుర్కొంటూనే జీవితం కొనసాగించిన ఊర్మిళ ఆదర్శానికి ఆస్కారమిస్తూనే అతి సామాన్యంగా తన పాత్రతత్వాన్ని చిత్రించుకోగలిగిందంటే స్త్రీలోని అంతర్గత శక్తులకు రూపమిచ్చిందనే చెప్పాలి. అధికారాలు, అనుబంధాలు ఆలోచనల్లో గాంభీర్యాన్ని తీసుకురానంత వరకూ వాటిని అర్థం చేసుకొనట్లేననీ వాటిని మనసు పెట్టకుండానే కొనసాగించినట్లేననీ చెప్పకనే చెప్పిన ఊర్మిళ ఉన్నత ఆలోచనాథృక్పథం జీవన సంకేతాన్ని వినూత్నంగా పరిచయం చేసిందంటే అతిశయోక్తి లేదు.

No comments:

Post a Comment

అవధూత 'సన్యాసి' అంటే ఎవరు ..?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు : అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉం...