బోదకాలు, క్షయ, కలరా, టైఫాయిడ్, అతిసార లాంటి వ్యాధులకు ఔషధాలు కనుగొన్నది తెలుగువాడు. అతనే యల్లాప్రగడ సుబ్బారావు. ఆ పేరు ఆధునిక వైద్యశాస్త్రానికి దిక్సూచి. ఆ పేరు మీదనే సుబ్బామైసిన్, సుబ్బరోమైసిన్ లాంటి యాంటీ బయాటిక్స్ తయారయ్యాయి. చిన్నప్పుడు అల్లరి చిల్లరగా ఉన్న కుర్రాడు పెద్దయ్యాక మానవాళికి మహోపకారి అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు, అతడి కన్నతల్లి తప్ప!
యల్లాప్రగడ సుబ్బారావు పుట్టింది 1895లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో. నాన్న జగన్నాథం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్. సర్కారు ఉద్యోగమే అయినా చాలీచాలని జీతం. పైగా ఏడుగురు సంతానం. తండ్రి ఎంతో కష్టపడేవాడు- బతుకుబండి లాగడానికి! కానీ ఇదేమీ తెలిసేంత వయసు కాదు సుబ్బారావుది. స్కూలుకి వెళ్లాలంటే విసుగు. చదువంటే చిరాకు. క్లాసుల్ని ఎగ్గొట్టేవాడు. పుట్టల్లో గుట్టల్లో తిరిగేవాడు. 13 ఏళ్ల వయసులో కాశీకి పారిపోవాలనుకొన్నాడు. తల్లి వెంకమ్మ వారించింది. ''ఈ గాలి తిరుగుళ్లు దేనికి?పాడైపోతావ్ కన్నా'' అని హెచ్చరించింది.
అయినా లాభం లేదు.
1911లో సుబ్బారావు మెట్రిక్ ఫెయిలయ్యాడు.
ఇలా కాదని- అతణ్ణి రాజమండ్రిలో ఉన్న తన పెద్దకొడుకు పురుషోత్తం వద్దకు పంపింది వెంకమ్మ. అక్కడ సుబ్బారావుకు చిలకమర్తి లక్ష్మీనరసింహిం, కందుకూరి వీరేశలింగం లాంటి వారి దగ్గర శిష్యరికం లభించింది. వారి ఆలోచనల ప్రభావం పడింది గానీ సుబ్బారావుకి పుస్తకాలన్నా, పరీక్షలన్నా ఆసక్తి కలగలేదు. అందుకే మళ్లీ మెట్రిక్ తప్పాడు.
అయినా పట్టువదల్లేదు వెంకమ్మ. ఈసారి మద్రాసులోని హిందూ హైస్కూలుకి పంపాలనుకొంది కొడుకుని. కానీ వెళ్ళనన్నాడు సుబ్బారావు. తల్లి బతిమాలింది. బుజ్జగించింది. అయినా 'ససేమిరా' అన్నాడు. నిజానికి అక్కడెక్కడో చదివించేంత స్థోమత ఆమెకి లేదు. అయినా అప్పో సప్పో చేయాలనుకొంది.
అంతలో 1913లో తండ్రి మరణించాడు. అప్పుడు సుబ్బారావు వయసు 18. ఓ పక్క భర్త మరణం. మరో పక్క అప్పుల భారం-అయినా కొద్దోగొప్పో ఉన్న బంగారాన్ని అమ్మి, కొడుకుని మద్రాస్ పంపాలని గట్టిగా అనుకొంది వెంకమ్మ. ఇది చూచి సుబ్బారావు చలించిపోయాడు. ఆలోచనలో పడ్డాడు. 'ఎందుకు అమ్మ నా చదువు కోసం అంతలా పరితపించిపోతోంది? ఇంటి పెద్ద దిక్కుపోయి పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని ఎందుకు నన్ను అమ్మ చదివించాలనుకొంటోంది?' అర్థమైంది సుబ్బారావుకి! అణువిస్ఫోటనం జరిగింది అతడిలో! ఇక మళ్లీ ఎన్నడూ ఏ పరీక్షా తప్పలేదు. జీవితపు పరీక్షలో ఫెయిలవ్వలేదు.
మద్రాసు వెళ్లాడు. ఇంటర్ పాసయ్యాడు. పైగా డిస్టింక్షన్‌లో. మద్రాసు మెడికల్ కాలేజీలో సీటు పొందాడు. కానీ ఫీజుకి డబ్బుల్లేవు. నీరుగారిపోయాడు. అమ్మ ధైర్యం నూరిపోసింది. చుట్టాల్ని, చుట్టుపక్కల్ని అడిగి డబ్బు సమకూర్చింది. అయినా సరిపోలేదు.
ఎవరో చెప్పారు- 'అనపర్తిలోని కస్తూరి వారి కుటుంబం ఆదుకొంటుందని!' పరుగెత్తుకెళ్లారు తల్లీకొడుకులు. వారు 'సరే' అన్నారు. కానీ ఓ షరతు విధించారు. తమ అమ్మాయి శేషగిరిని సుబ్బారావు చేసుకోవాలన్నారు. ఆయన అర క్షణం కూడా ఆలోచించ లేదు. అలా ఆమెతో 1919లో పెళ్లయింది సుబ్బారావుకి.
చెన్నపట్టణంలో కొత్త కాపురం.
అంతలో మెడిసిన్ పూర్తయింది. ప్రాక్టీసు పెట్టమన్నారంతా!
ఇంతలో పెద్దన్నయ్య పురుషోత్తం 'స్ర్పూ' వ్యాఽధితో మరణించాడు. వారం తిరక్కుండానే మరో అన్నయ్య కృష్ణమూర్తి అదే వ్యాధితో కన్నుమూశాడు. ఏడ్చేశాడు సుబ్బారావు. ఆహారనాళాల్లో పుండుకి కారణమయ్యే 'స్ర్పూ' సోకితే ఆ రోజుల్లో ఎవరైనా చనిపోవాల్సిందే!
అప్పుడనుకొన్నాడు సుబ్బారావు. 'డాక్టర్‌గా ప్రాక్టీసు చేస్తే రోగాల్ని నయం చేయగలను. నేను మాత్రమే డబ్బులు సంపాదించగలను. కానీ పరిశోధనలు చేస్తే ఆయా జబ్బులు రాకుండా టీకాలనో, ఔషధాలనో కనిపెడితే తరం తరం నిరంతరం ఉపయోగపడగలను'.
వెంటనే అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ కాలేజీకి అప్లై చేశాడు. అవకాశం వచ్చింది కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. మామగారు కొంత, కాకినాడలోని ఓ ఛారిటీ సంస్థ కొంత సాయం చేశారు. అలా 1923లో ఒక్కడే అమెరికాకి ప్రయాణమయ్యాడు. భార్య శేషగిరి అప్పటికే గర్భవతి. సుబ్బారావు వెళ్లిన తర్వాత ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ శిశువు 9 నెలల వయసులో 'సర్పి' రోగంతో మరణించింది. అయినా సుబ్బారావు వెనక్కి రాలేని పరిస్థితి. అమెరికా వెళ్లిన కొత్తలో సుబ్బారావు చేయని పనిలేదు. బోస్టన్ ఆస్పత్రిలో మూత్రశాలల్ని, పేషెంట్ల బెడ్‌పాన్లని శుభ్రం చేసేవాడు- సంపాదన కోసం! రాత్రంతా ఇలా కష్టపడటం, పగలంతా పరిశోధనల్లో మునిగితేలడం!!
1924 నుంచి సుబ్బారావు ఫలితాలు ప్రపంచానికి తెలిశాయి. ఫిస్కే అనే శాస్త్రజ్ఞుడితో కలిసి శరీరకణాల్లోని భాస్వరాన్ని నిర్ధారించే 'ర్యాపిడ్ కెలోరోమెట్రిక్ మెథడ్'ని ఆవిష్కరించాడు. జీవరాశి భౌతిక ప్రక్రియల్ని నిర్ణయించి ఆడినోసిన్ ట్రైఫాస్ఫేట్ గుట్టువిప్పాడు. 'హెట్రాజెన్'ని కనిపెట్టి బోదకాలు, ఇసినోఫిలియాలను దూరం చేశాడు. క్షయ వ్యాధి నివారిణిగా 'ఇనోనెక్స్'ని కనుగొన్నాడు. టెట్రాసైక్లిన్‌తో కలరా, టైఫాయిడ్, ప్లేగు, అతిసారం లాంటి వాటికి దివ్యౌషధం అందించాడు. పిల్లల్లో
బ్లడ్ క్యాన్సర్‌ని అరికట్టే మెథాట్రెక్సేట్, అరియోమైసిన్‌లను కనిపెట్టాడు.
ఇదంతా ఒక ఎత్తు.
ఏ 'స్ర్పూ' వ్యాధి తన అన్నల్ని కబళించిందో దానిని అరికట్టే ఫోలిక్ యాసిడ్ విటమిన్‌ని కనుగొనడం మరొక ఎత్తు! యల్లాప్రగడ సుబ్బారావు జన్మధన్యతకి అదో కారణం. అలా ఎన్నెన్నో పరిశోధనల్లో మునిగిపోయి -అమెరికా వెళ్లి ఒక్కసారి కూడా భారత్ రాలేకపోయాడు. 1948లో అమెరికాలోనే గుండెపోటుతో మరణించాడు.
ఏ పెళ్లి కారణంగా సుబ్బారావు జీవితం ప్రపంచానికి ఉపయోగపడిందో, ఆ పెళ్లి కారణంగానే- శేషగిరి శేషజీవితం భర్త సాంగత్యానికి నోచుకోలేకపోయింది.
ఆమె శూన్యం- మానవాళికి మహా పుణ్యం! ఫ ఆకెళ్ల రాఘవేంద్ర

No comments:
Post a Comment