భారత ప్రధాని నరేంద్రమోడీ మయన్మార్ పర్యటనలో ఆంగ్ సన్ సూకితో మాట్లాడారు. మయన్మర్ లోని రాకినే రాష్ట్రంలో తీవ్రవాద హింస పట్ల మోడీ గారు తన ఆందోళన వెలిబుచ్చారు. ఈ హింసాకాండకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మయన్మార్ ప్రభుత్వానికి తమ సహాయసహకారాలుంటాయని హామీ ఇచ్చారు. కాని రోహింగ్యాలపై దారుణ మారణకాండ గురించి ఒక్క మాట మాట్లాడలేదు.
ప్రధానిగా మోడీ రెండవసారి మయన్మార్ సందర్శించారు. దాదాపు లక్షా పాతికవేల మంది రోహింగ్యా అభాగ్యులు మయన్మార్ సైనికదళాల హింసాకాండను తప్పించుకోడానికి శరణార్ధులై సరిహద్దులు దాటుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. లోకమంతా ఈ సంక్షోభం గురించి మాట్లాడుతోంది. కాని మన ప్రధాని ఆ విషయమై మౌనమే ఉత్తమం అనుకున్నారు. ఆంగ్ సన్ సూకీతో మాట్లాడిన తర్వాత ఆయన ప్రకటించిన ముఖ్యమైన విషయాలేమంటే, మయన్మార్ పౌరులు భారతదేశం సందర్శించాలంటే నో కాస్ట్ విసాలిస్తామన్నారు. భారతదేశంలోని వివిధ జైళ్ళలో ఉన్న 40 మంది మయన్మార్ పౌరులను విడుదల చేసి పంపేస్తామన్నారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదానికి అనుగుణంగా మయన్మార్ అభివృద్ధికి తోడ్పడుతామని అన్నారు. (ఇక్కడ భారతప్రజల్లో బడుగు బలహీన మైనారిటీ ప్రజల వికాసం ఏమయ్యిందో). ఇద్దరు నాయకులు టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడతామని బలంగా చెప్పారు.
మయన్మార్ రోహింగ్యా సమస్య పట్ల భారతదేశం మౌనమే ఉత్తమమని భావిస్తుంది కాని మన పొరుగున ఉన్న చైనా అలా భావించడం లేదు. రోహింగ్యా సమస్య పరిష్కారానికి మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు అవసరమైతే సహాయపడతామని గత ఏప్రిల్ లో ప్రకటించిందన్నది గుర్తుంచుకోవాలి. అప్పట్లో దాదాపు 69000 మంది రోహింగ్యాలు మయన్మార్ సైన్యం దుర్మార్గాలను తప్పించుకోడానికి బంగ్లాదేశ్ లో శరణుజొచ్చారు. చైనాకు అటు మయన్మార్ తోను, ఇటు బంగ్లాదేశ్ తోను మంచి సంబంధాలున్నాయన్నది కూడా మరిచిపోరాదు. రోహింగ్యా సమస్య అంతర్జాతీయ సమస్యగా మారిన పరిస్థితుల్లో చైనా పెద్దన్న పాత్ర పోషించడానికి వెనుకడుగు వేయడం లేదు. భారత ప్రయోజనాల దృష్ట్యా రోహింగ్యా సమస్య విషయంలో ఖచ్చితమైన విధానం మనం రూపొందించుకున్నామా అన్నది ప్రశ్న.
మరోవైపు మయన్మార్ పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. రోహింగ్యాలపై కొనసాగుతున్న హింసా మారణకాండల విషయమై ప్రపంచదేశాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటర్స్ జాతినిర్మూలన స్థాయిలో పరిస్థితి ఉందని చేసిన వ్యాఖ్య గమనించదగింది. భద్రతామండలికి ఆయన లేఖ కూడా ఈ విషయమై రాశాడు. ఈ హింసాకాండ తీవ్రమైన మానవ సంక్షోభంగా మారవచ్చని హెచ్చరించాడు. ఈ సంక్షోభంలో బంగ్లాదేశ్ కు అవసరమైన సహాయం అందిస్తామని ఇండోనేషియా చెప్పింది. మయన్మార్ తో దౌత్యసంబంధాలు రద్దు చేసుకోవాలన్న ఒత్తిడి ఇండోనేషియాలో పెరుగుతోంది. దాదాపు పదిలక్షల మంది రొహింగ్యాలపై కొనసాగుతున్న తీవ్రమైన దాడులకు వ్యతిరేకంగా ఆంగ్ సన్ సూకీ నోరిప్పడం లేదు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ వ్యాఖ్యల తర్వాత భద్రతామండలి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశాలున్నాయి. మయన్మార్ మరోవైపు చైనా, రష్యా దేశాలతో సంప్రదింపులు జరుపుతుంది. భద్రతామండలిలో ఏదైనా తీర్మానం వస్తే అడ్డుకోడానికి చైనా, రష్యాలపై ఆధారపడుతోంది. చైనా ఈ విషయమై మయన్మార్ కి సహకరిస్తే అందుకు బదులుగా మయన్మార్ లో చైనా పలుకుబడి పెరుగుతుంది. డోక్లామ్ లో చైనా ఏం చేసిందో మనం చూశాం. నేపాల్ లో చైనా ఏం చేస్తుందో మనకు తెలుసు. పాకిస్తాన్ లో చైనా పలుకుబడి మనకు తెలుసు. బంగ్లాదేశ్, శ్రీలంకలు చైనాను కాదనే స్థితిలో లేవు. మయన్మార్ కూడా అదే బాటన నడుస్తోంది. మన ఇరుగుపొరుగున చైనా ప్రాబల్యం ఎలా పెంచుకుంటుందో గమనించవలసిన అవసరం పాలకులకు ఉంది.
మయన్మార్ లో మానవత్వం మంటగలిసింది. లక్షా పాతికవేలమంది ప్రజలు నిరాశ్రయులై, ప్రాణాలు అరచేత పట్టుకుని సరిహద్దులు దాటి శరణార్ధులయ్యారు. బంగ్లాదేశ్ లో తలదాచుకున్నారు. ఈ శరణార్థులు మయన్మార్ సైనికదళాల అమానుషాలను ఏకరువు పెడుతున్నారు. గుండెలు పిండేసే వృత్తాంతాలు, హృదయవిదారకమైన కథనాలు. సరిహద్దులు దాటడంలో వందలాది మంది మరణించారు. మయన్మార్ సైనికదళాల దురాగతాల్లో వేలాది మంది ఆహుతయ్యారు. ఈ సమస్య తీవ్రత పెరిగిన తర్వాత అనేకమంది ఆంగ్ సన్ సూకీని నిలదీయడం మొదలైంది. శాంతి బహుమతి గ్రహీత మాత్రం నోరిప్పడం లేదు.
రోహింగ్యాలపై దమనకాండ నెమ్మదిగా సాయుధ పోరాటదళాలు ఏర్పడడానికి కారణమైంది. ఆగష్టు 25వ తేదీన రోహింగ్యా మిలిటెంట్లు అక్కడి భద్రతాదళాలపై దాడులు చేశారు. ప్రతిచర్యగా భద్రతాదళాలు రోహింగ్యా గ్రామాలపై దాడులు చేసి ప్రజలపై కక్ష తీర్చుకోవడం ప్రారంభమైంది. భద్రతాదళాల దాడుల్లో మరణించిన వారంతా అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీకి చెందిన వారని మయన్మార్ చెబుతోంది. కాని గ్రామాలకు గ్రామాలు మంటల్లో తగలబడుతున్న వార్తలు వస్తున్నాయి. రోహింగ్యాలంతా మిలిటెంట్లే అన్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతున్నారు.
మలేషియా తన దౌత్యవేత్తను మయన్మార్ నుంచి వెనక్కి పిలుచుకుంది. మాల్దీవ్స్ కూడా మయన్మార్ తో అన్ని సంబంధాలు రద్దు చేసుకుంది. చెచెన్యాలో అనేకమంది రొహింగ్యాలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. మయన్మార్ దౌత్యకార్యాలయాలపై దాడులు జరిగే ప్రమాదాలు తలెత్తాయి. పాకిస్తాన్ కూడా మయన్మార్ వైఖరిని ఖండించింది, కాని రోహింగ్యా శరణార్ధుల కోసం సరిహద్దులు తెరవలేదు. పాకిస్తాన్ ద్వంద్వవైఖరి, నీచబుద్దికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? భారతదేశంలో 40వేల మంది రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్నారని కేంద్ర మంత్రి అన్నారు. వీరి విషయంలో భారత వైఖరి ఏమిటో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది.
ప్రపంచంలో తీవ్ర దౌర్జన్యాలకు, హింసాకాండకు గురవుతున్న ప్రజలు రోహింగ్యాలు. ఈ రోహింగ్యాలెవరు?
మయన్మార్ బౌద్ధులు అధికంగా ఉన్న దేశం. రోహింగ్యాలు మైనారిటీ తెగ. ముస్లిములు. ప్రస్తుతం 11 లక్షల మంది రోహింగ్యాలు అక్కడ నివసిస్తున్నారని అంచనా. ఇందులో లక్షా పాతికవేల మంది శరణార్థులుగా తరలిపోయారు. రోహింగ్యాలు మాట్లాడే భాష రుయింగ్యా. మయన్మార్ లోని రాఖినే రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఈ రాష్ట్రంలోని ఇతర ప్రజలు మాట్లాడే భాషకు భిన్నమైన భాష మాట్లాడతారు. మయన్మార్ లో 135 తెగలు అధికారికంగా మయన్మార్ పౌరసత్వం ఉన్న తెగలుగా గుర్తించబడ్డాయి. కాని రోహింగ్యాలకు అలాంటి గుర్తింపు లేదు. 1982 నుంచి వారికి పౌరసత్వం లేదు. అంటే వాళ్ళు దేశంలేని ప్రజలయ్యారు.
రోహింగ్యాలంతా రాఖినే రాష్ట్రం తీరప్రాంతంలో నివసిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వాళ్ళు ఈ ప్రాంతం వదిలి వెళ్ళరాదు. అంటే అదొక ఓపెన్ జైలు వంటిది వారికి. రాఖినే రాష్ట్రం మయన్మార్ లో అతిపేద రాష్ట్రం. కనీస మౌలిక సదుపాయాలు కూడా అక్కడ కనబడవు.
అనేకమంది చరిత్రకారుల ప్రకారం రోహింగ్యాలు 12వ శతాబ్దం నుంచి అక్కడ నివసిస్తున్నారు. బ్రిటీషు వారి పాలనలో అంటే 1824 నుంచి 1948 వరకు ఇండియా, బంగ్లాదేశ్ ల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలను, శ్రామికులను మయన్మార్ కు తరలించడం జరిగింది. రంగూన్ వెళ్ళడం గురించి కథలు మనం కూడా విన్నవే. అప్పట్లో బ్రిటీషు ప్రభుత్వం మయన్మార్ లేదా బర్మాను భారతదేశంలో ఒక ప్రావిన్సుగానే ఉంచింది. అందువల్ల ఈ వలసలు దేశంలో జరిగిన అంతర్గత వలసలుగానే పరిగణించబడ్డాయి. ఇలా వలస వచ్చిన వారిపట్ల అక్కడి స్థానికుల్లో వ్యతిరేకత ఉండేది. మయన్మార్ స్వతంత్రం పొందిన తర్వాత ఇలా వలస వచ్చిన వారందరినీ, అంటే బ్రిటీషు కాలంలో బ్రిటీషు వాళ్ళు తీసుకొచ్చిన కూలీలను, ఇతరులను అందరినీ అక్రమంగా దేశంలోకి వచ్చినవారిగా ప్రకటించింది. ఈ క్రమంలో రోహింగ్యాలకు దేశంలో పౌరసత్వం నిరాకరించింది.
ఈ విధానం వల్ల బౌద్ధులు అధికంగా ఉన్న మయన్మార్ లో చాలా మంది బౌద్ధులు రోహింగ్యాలను బెంగాలీలుగా భావించడం ప్రారంభించారు. మయన్మార్ స్వతంత్రం పొందిన వెంటనే అంటే 1948లో సిటిజన్ షిప్ చట్టం చేశారు. ఈ చట్టంలో రోహింగ్యాలను పౌరులుగా చేర్చలేదు. అయితే రెండు తరాలుగా నివసిస్తున్న వాళ్ళు గుర్తింపుకార్డు తీసుకోవచ్చన్నారు. ఆ విధంగా కొందరు రోహింగ్యాలకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. కొందరికి పౌరసత్వం కూడా లభించింది. పార్లమెంటులో సేవలందించిన రోహింగ్యాలు కూడా ఉన్నారు. మయన్మార్ లో తెగలు, జాతుల ఘర్షణ బయటి ప్రపంచానికి ఇంతవరకు తెలియని విషయంగానే ఉండిపోయింది. కచిన్, షాన్ రాష్ట్రాల్లో హింసాకాండ గురించి కూడా బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. 2015లో మయన్మార్ ప్రభుత్వం ఎనిమిది తీవ్రవాద సంస్థలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పెద్ద పెద్ద సంస్థలు కొన్ని దానిలో పాలుపంచుకోలేదు. 2016లో కూడా కరేన్ రాష్ట్రంలో హింసాకాండ పెల్లుబికింది. చైనా మూలాలకు చెందిన తెగలతోను ఘర్షణలున్నాయి.
మయన్మార్ లో 1962 సైనిక కుట్ర తర్వాత పౌరులందరూ జాతీయ రిజిస్ట్రేషన్ కార్డులు తీసుకోవాలన్నారు. కాని రోహింగ్యాలకు విదేశీ గుర్తింపు కార్డులు మాత్రమే ఇచ్చారు. ఫలితంగా ఉద్యోగాల్లోను, విద్యావకాశాల్లోను వారికి అవకాశాలు సన్నగిల్లాయి. 1982లో కొత్త పౌరసత్వ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం రోహింగ్యాలు అసలు మయన్మార్ పౌరులే కాదన్నారు. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి కుటుంబం 1948 ముందు నుంచి మయన్మార్ లో నివసిస్తున్నట్లు ఆధారాలు చూపించాలి. జాతీయభాషల్లో ఒక భాష అనర్గళంగా మాట్లాడాలి. రోహింగ్యాలకు ఈ ఆధారాలు సంపాదించి ఇవ్వడం అంత తేలిక కాదు. పైగా వారి భాష జాతీయభాషల్లో లేదు. పౌరులు కాదని తేల్చేసిన తర్వాత వారిపై అనేక ఆంక్షలు పెట్టారు. చదువుకునే హక్కు లేదు. పనిచేసే హక్కు లేదు. ప్రయాణం చేసే హక్కు లేదు. పెళ్ళి చేసుకోవాలన్న ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. వైద్య సేవలు వారికి అందవు. 1970 నుంచి ఒక పద్ధతి ప్రకారం రోహింగ్యాలను నిర్మూలించే కార్యక్రమం చేపట్టారు. ఫలితంగా అనేకమంది పొరుగున ఉన్న బంగ్లాదేశ్ పారిపోయారు. కొందరు మలేషియా తరలిపోయారు. ధాయ్ లాండ్ ఇతర తూర్పు ఆసియా దేశాలకు వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. దౌర్జన్యాలు, అణిచివేతలు, హింసామారణకాండలు, మానభంగాలు సాధారణమైపోయిన తర్వాత సహజంగానే సాయుధ ప్రతిఘటనలు కూడా మొదలవుతాయి. అక్టోబర్ 2016లో రోహింగ్యా సాయుధ సంస్థ బోర్డర్ పోలీసులపై దాడి చేసింది. ఆ తర్వాత సైనికదళాలు రోహింగ్యా గ్రామాలపై పడి సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని హింసాకాండ కొనసాగించాయి. ఐక్యరాజ్యసమితి అధికారి ఒకరు అప్పట్లోనే మయన్మార్ సైన్యం జాతినిర్మూలనకు పాల్పడుతుందని అన్నారు. అంతకు ముందు 2013లో కూడా హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ మయన్మార్ ను అభిశంసిస్తూ జాతినిర్మూలనకు పాల్పడుతుందని చెప్పింది. మొన్న ఆగష్టులో మళ్ళీ సాయుధ రోహింగ్యా సంస్థ పోలీసులపై దాడులకు దిగింది. ఆ వెంటనే సైన్యం రోహింగ్యా గ్రామాలపై పడి మారణకాండ, దహనకాండ, మానభంగాలు, హింసాకాండ కొనసాగించింది. నిరాయుధులైన ప్రజలపై విచక్షణ లేకుండా సైన్యం కాల్పులు జరుపుతున్న సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అనేక హక్కుల సంస్థలు ఈ దురాగతాలను రికార్డు చేశాయి.
మయన్మార్ చాన్సలర్ ఆంగ్ సన్ సూకీ రోహింగ్యాల సమస్య గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. మాట్లాడితే తన పదవి ఊడుతుందన్న భయం ఆమెది. ఆమె ప్రభుత్వం రోహింగ్యాలను పౌరులుగా గుర్తించడం లేదు. టెర్రరిస్టుల వల్లనే ఈ హింసాకాండ జరుగుతుందని చెబుతోంది. నిజానికి సైన్యం పై ఆమెకు అదుపు లేదు. సైన్యం చాలా కాలం ఆమెను గృహనిర్బంధంలో ఉంచిందన్నది మరిచిపోరాదు. సైన్యానికి వ్యతిరేకంగా నోరు విప్పి అణగారిన వర్గాల కోసం మాట్లాడే ధైర్యం ఆమెకు లేదన్నది తేలిపోయింది.
ఆమె ప్రతిష్ఠ కాపాడ్డానికన్నట్లు సెప్టెంబరు 2016లో ఆంగ్ సన్ సూకి ఒక కమీషన్ నియమించింది. ఐక్యరాజ్యసమితి మాజీ జనరల్ సెక్రటరీ కోఫీ అన్నాన్ సారథ్యంలో రొహింగ్యా సమస్య పరిష్కారానికి ఏర్పరచిన కమీషన్ ఇది. ఈ కమీషన్ కు ఎలాంటి అధికారాలు లేవు. కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠ కాపాడుకోడానికి ఆమె చేసిన ప్రయత్నం మాత్రమేనని తేలిపోయింది. ఆమె సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడ్డానికి వేసిన ఎత్తుగడ మాత్రమేనని తెలిసిపోయింది. కోపీ అన్నాన్ ప్రయాణాలపై ఆంక్షలను, పౌరసత్వంపై ఆంక్షలను తొలగించాలన్నారు. కమీషన్ ఏర్పాటు చేసినప్పుడు కమీషన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పిన సూకీ తర్వాత ముఖం చాటేసింది.
మయన్మార్ నుంచి పారిపోయి వచ్చిన రోహింగ్యాలు అధికంగా బంగ్లాదేశ్ లోనే శరణుజొచ్చారు. తాత్కాలిక శిబిరాల్లో దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వారంత ఆక్రమంగా మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులుగా బంగ్లాదేశ్ భావిస్తోంది. రోహింగ్యా సమస్య బంగ్లాదేశ్ కు పెద్ద సమస్యగా మారింది. రోహింగ్యా శరణార్థులను తిరిగి మయన్మార్ పంపాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.
రోహింగ్యాలపై మయన్మార్ సైన్యం దారుణ మారణకాండ, శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాల పట్ల వివిధ దేశాలు వ్యవహరిస్తున్న తీరును హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మార్చి నెలలలో ఐక్యరాజ్యసమితి ఒక స్వతంత్ర అంతర్జాతీయ మిషన్ ఏర్పాటు చేసి మయన్మార్ లో రోహింగ్యాలపై దౌర్జన్యాలను విచారించాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. ఐక్యరాజ్యసమితి పరిశీలకులకు అనుమతులివ్వడానికి కూడా మయన్మార్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఐక్యరాజ్యసమితి పరిశీలకులను అనుమతించకపోతే ఉత్తరకొరియా, సిరియా వంటి దేశాల జాబితాలో వేయవలసి వస్తుందన్న హెచ్చరికలు హ్యూమన్ రైట్స్ వాచ్ చేసింది.
ప్రస్తుతం మయన్మార్ సైన్యం ప్రారంభించిన దాడులకు కారణం అగష్టు నెలలో భద్రతాదళాలపై రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ చేసిన దాడులు. ఈ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ రోహింగ్యా ప్రజలను కాపాడ్డానికి ఏర్పడిన సంస్థ అని మార్చి 2017లో ప్రకటించుకుంది. అంతకు ముందు ఉన్న పేరు అల్ యకీన్ మూవ్ మెంట్ పేరు మార్చింది. ఆత్మరక్షణ నియమాల క్రింద, అంతర్జాతీయ చట్టాల ప్రకారం రోహింగ్యా ప్రజలను కాపాడే ప్రయత్నాలన్నీ చేస్తామని ప్రకటించింది. మయన్మార్ ప్రభుత్వం ఈ సంస్థను టెర్రరిస్టు సంస్థగా పేర్కొంటుంది. అయితే మార్చిలో చేసిన ప్రకటనలో ఈ సంస్థ ప్రపంచంలోని ఏ టెర్రరిస్టు సంస్థతోను ఎలాంటి సంబంధాలు పెట్టుకోమని, ఎలాంటి టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడమని కూడా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనలో గమనించవలసిన విషయమేమంటే, సాధారణ ప్రజలు వారే మతం వారయినా, వారికి వ్యతిరేకంగా టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడం అని చెప్పుకుంది. ఆత్మరక్షణకు తాము చేసే దాడులు అణిచివేతలు, హింసాకాండల బర్మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే కొనసాగుతాయని చెప్పింది. పోలీసుపోస్టులు, సైనిక స్థావరాలపై దాడులకు బాధ్యత తమదే అని చెప్పింది. సైన్యం చేసిన ప్రతిదాడుల్లో చనిపోయింది సాధారణ ప్రజలే. అయితే ఈ సంస్థ ప్రభుత్వ ఇన్ఫార్మర్లన్న అనుమానంతో సాధారణ రోహింగ్యా ప్రజలను కూడా చంపిందని వార్తలున్నాయి. రోహింగ్యాలపై మయన్మార్ ప్రభుత్వ దమననీతి దానికి ప్రతిస్పందనగా తలెత్తుతున్న సాయుధ గ్రూపులు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి.
మయన్మార్ గుర్తించిన 135 జాతులలో బమర్ ముఖ్యమైంది. షాన్, కరీన్, రాఖినే, రోహింగ్యా, కచిన్, చిన్, కరెన్నీ, మోన్, వా, కోకాంగ్ చైనీస్ తదితర జాతులున్నాయి. తెలుగువాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు. రంగమెళ్ళి పోయానో నారాయణమ్మ, రంగూను పురం చేశానో నారాయణమ్మ వంటి పాటలు మనకు తెలిసినవే. మయన్మార్ లో వివిధ తెగల మధ్య స్పర్థలు కూడా ఉన్నాయి. మయన్మార్ చరిత్ర కూడా ఇక్కడ మనం క్లుప్తంగా చూడవలసిన అవసరం ఉంది. అప్పటి రంగూన్ పేరు ఇప్పుడు యాంగాంగ్.
మయన్మార్ లో మేజర్ జనరల్ ఆంగ్ సన్ బామర్ మెజారిటీ ప్రజలకు చెందిన ప్రముఖ నాయకుడు. మయన్మార్ స్వతంత్ర పోరాటంలో కీలకమైన నాయకుడు. మయన్మార్ జాతిపితగా గౌరవం పొందిన నేత. మయన్మార్ స్వతంత్రానికి ఆరు నెలలు ముందే ఆయన హత్య జరిగింది. ఆయన కుమార్తు ఆంగ్ సన్ సూకీ. అంగ్ సన్ హత్య జరక్కుండా ఉన్నట్లయితే మయన్మార్ లో తెగల మధ్య ఘర్షణలు స్పర్థలను రూపుమాపి సమైక్య మయన్మార్ సాధించి ఉండేవాడని అంటారు. మయన్మార్ స్వతంత్రం తర్వాతి నుంచి ఇక్కడ వివిధ మైనారిటీ తెగలు పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. 1947లో ఆంగ్ సన్ చొరవతో వివిధ తెగల సమావేశం జరిగింది. బామర్ మెజారిటీ ప్రజలు వివిధ మైనారిటీ తెగల ప్రజలు పాల్గొన్నారు. దీన్ని పాంగ్లాంగ్ కాన్ఫరెన్స్ అంటారు. సమైక్య బర్మాకు అవసరమైన ఒప్పంద పత్రం అక్కడ రూపొందింది. కాని ఇప్పుడు ఆ ఆంగ్ సాన్ కుమార్తె ఆంగ్ సన్ సూకీ ఈ సమైక్యతను కొనసాగించడం అనుమానస్పదంగా కనబడుతుంది. బర్మాలో ఈ సంఘర్షణల చరిత్ర 1886 నుంచి కనిపిస్తుంది. బ్రిటన్ బర్మా రాజవంశాన్ని గద్దె నుంచి కూలదోసింది. బర్మాలో మెజారిటీ అయిన బామర్ ప్రజలకు అధికారంలో చోటు కల్పిస్తే తిరుగుబాటు వస్తుందన్న భయంతో బ్రటీషువారు మైనారిటీ తెగల నాయకులకు ముఖ్యమైన పదవులు కట్టబెట్టారు. రెండవ ప్రపంచయుద్ధంలో ఈ మైనారిటీ తెగల ప్రజలు బ్రిటీషు వారితో కలిసి పోరాడారు. కాని ఆంగ్ సన్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బామర్ ప్రజలు జపాన్ పక్షాన పోరాడారు. అయితే జపాన్ ఓడిపోయే పరిస్థితి కనబడడంతో ఆంగ్ సన్ బ్రిటన్ పక్షానికి వచ్చారు. బ్రిటన్ లో చర్చిల్ ఓడిపోయి అట్లీ అధికారంలోకి వచ్చాడు. అట్లీ బర్మాలో మెజారిటీ ప్రజలైన బామర్ ల నాయకుడు ఆంగ్ సన్ నే లండన్ ఆహ్వానించాడు. బామర్ ప్రజలకు స్వతంత్రం ఇస్తానన్నాడు. అంగ్ సన్ బర్మా తిరిగి వచ్చిన తర్వాత చాలా వివేచనతో వ్యవహరించాడు. బర్మాలోని వివిధ మైనారిటీ తెగలను గుర్తిస్తూ పాంగాండ్ కాన్ఫరెన్సు 1947లో జరిపాడు. ఈ సమావేశంలో షాన్, కరేన్, చిన్ తదితర మైనారిటీ తెగల నాయకులంతా పాల్గొన్నారు. అక్కడ ఈ తెగలన్నింటి మధ్య ఒప్పందం కుదిరింది. యూనియన్ ఆఫ్ బర్మా ఏర్పడింది. అయితే తమ పట్ల అనుచితంగా వ్యవహరించినట్లనిపిస్తే ఏ తెగయినా 10 సంవత్సరాల తర్వాత ఈ ఒప్పందం నుంచి వైదొలగవచ్చు. కాని ఆ తర్వాత ఆంగ్ సన్ హత్య జరగడంతో తెగల మధ్య సయోధ్య ప్రయత్నాలకు గండి పడింది. ఈ వైమనస్యాలు, స్పర్థలు నేటికి కూడా కొనసాగుతున్నాయి. మరో విషయమేమంటే, అంగ్ సన్ పోషించిన పాత్రను మరీ పెంచి చెప్పడం జరుగుతుందని, బామర్ మెజారిటీ ప్రజలకు అనుకూలంగా ఈ చరిత్ర రాయబడుతోందన్న వాదనలున్నాయి. షాన్ తెగ నాయకుడు సావో షూ థాయిక్ పోషించిన పాత్ర మరుగున పడేశారన్న కథనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆంగ్ సన్ సూకీ 21వ శతాబ్దపు పాంగ్లాంగ్ కాన్ఫరెన్సు ఏర్పాటు చేశారు. వివిధ తెగల నాయకులతో శాంతిచర్చల కోసం ఏర్పరచిన సమావేశం. అయితే ఈ సమావేశంలో ఆంగ్ సన్ సూకీకి, ఆమె పార్టీ ప్రతినిధులకు, బామర్ తెగ ప్రతినిధులకు రాజగౌరవాలు, ఇతర మైనారిటీ తెగలను పురుగుల్లా చూడడం జరిగిందని, కనీసం వారికి కూర్చునే కుర్చీలెక్కడున్నాయో కూడా తెలియలేదని కథనాలు వచ్చాయి.
మయన్మార్ మాన్ రాష్ట్రంలో ఒక స్టీలు బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దానికి అంగ్ సన్ పేరు పెట్టారు. కాని స్థానిక తెగ ప్రజలు దీనికి తీవ్రమైన అభ్యంతరం తెలుపుతూ ప్రతిఘటించారు. మయన్మార్ లో బామర్ ప్రజలు 68శాతం ఉన్నారు. మిగిలిన వారంత వివిధ మైనారిటీ తెగలు. మయన్మార్ లో కేవలం బౌద్ధం మాత్రమే లేదు. ఇది బహుళ మతాల దేశం. దాదాపు 6.2 శాతం క్రయిస్తవులున్నారు. చిన్, కచిన్, కరేన్ ప్రజల్లో క్రయిస్తవులున్నట్లు తెలుస్తోంది. అలాగే 4.3 శాతం ముస్లిములున్నారు. బామర్ ప్రజల సంఖ్యను ప్రభుత్వాలు కావాలని ఎక్కువ చేసి చూపిస్తున్నాయనే ఆరోపణ కూడా ఉంది. బామర్ తెగలో అనేక ఉపతెగులున్నాయి. చిన్, కచిన్, కరేన్ తదితర తెగలపై కూడా దౌర్జన్యాలు, హింసాకాండల వార్తలున్నాయి. అందరికంటే అత్యధికంగా, అది దారుణంగా హింసాకాండకు బలవుతుంది రోహింగ్యా ముస్లిములు. ఇదంతా ఎందుకు జరగుతుందంటే, మొత్తం మయన్మార్ బామర్ ప్రజలదే అన్న జాతితత్వం. ఫాసిజం దీనికి కారణాలు. ప్రపంచంలో పలు చోట్ల దారుణమారణ హోమాలకు కారణమైన ఫాసిస్టు భూతమే మయన్మార్ లో తెగల మధ్య చిచ్చు పెడుతుంది. నేడు రోహింగ్యాలు కావచ్చు, రేపు మరో తెగ అవుతుందన్న భయాలు అక్కడ ఉన్నాయి. లోలోన కుతకుతలాడుతున్న లావా అగ్నిపర్వతంలా బద్దలు కావచ్చు. ఈ నేపథ్యంలో మన పొరుగున జరుగుతున్న పరిణామాలకు సకాలంలో సరయిన విధంగా ప్రతిస్పందించవలసిన అవసరం మన ప్రభుత్వం గుర్తిస్తుందా?

No comments:
Post a Comment